Wednesday, December 4, 2024

UPI | నవంబర్‌లో తగ్గిన యూపీఐ చెల్లింపులు..

ఈ సంవత్సరం అక్టోబర్‌ నెలలో పండుగల సీజన్‌తో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ చెల్లింపులు నవంబర్‌లో తగ్గాయి. లావాదేవీల సంఖ్య 7 శాతం తగ్గి 1,54,800 కోట్లుగా నమోదయ్యాయి. లావాదేవీల విలువ 8 శాతం తగ్గి 21.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను ఆదివారం నాడు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది.

అక్టోబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,65,800 కోట్లుగా ఉంది. లావాదేవీల విలువ 23.5 లక్షల కోట్లుగా ఉన్నాయి. యూపీఐ అమల్లోకి వచ్చిన 2016, ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో అత్యధికంగా నమోదయ్యాయి. పండుగల సీజన్‌ మూలంగా అక్టోబర్‌లో జరిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

పండుగల సీజన్‌ తరువాత వచ్చిన నవంబర్‌లో సహజంగానే లావాదేవీలు తగ్గాయి. 2023 నవంబర్‌తో పోల్చితే మాత్రం ఈ నవంబర్‌లో లావాదేవీలు సంఖ్య 38 శాతం, విలువ 24 శాతం పెరిగింది. రోజువారి యూపీఐ లావాదేలు అక్టోబర్‌లో 535 మిలియన్లు జరిగితే, నవంబర్‌లో ఇవి 516 మిలియన్లుగా ఉన్నాయి.

రోజువారి యూపీఐ లావాదేవీల విలువ అక్టోబర్‌ నెలలో 75,801 కోట్లుగా ఉంటే, నవంబర్‌లో ఇవి 71,840 కోట్లుగా ఉన్నాయి. ఇమ్మిడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) లావాదేవీలు నవంబర్‌లో భారీగా తగ్గాయి. అక్టోబర్‌లో ఇవి 467 మిలియన్లు జరిగితే నవంబర్‌లో 13 శాతం తగ్గి 408 మిలియన్లుగా నమోదయ్యాయి.

ఐఎంపీఎస్‌ లావాదేవీల విలువ 11 శాతం తగ్గి 5.58 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2023 నవంబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్‌లో ఐఎంపీఎస్‌ లావాదేవీల 14 శాతం తగ్గాయి. లావాదేవీల విలువ మాత్రం 4 శాతం పెరిగాయి. రోజువారి లావాదేవీలు 15 మిలియన్ల నుంచి 14 మిలియన్లకు తగ్గాయి. లావాదేవీల విలువ మాత్రం 18,611 కోట్ల నుంచి 20,303 కోట్ల రూపాయలకు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement