టాప్ టెన్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలోఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా టాప్ 10 ఐటీ కంపెనీలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్ధిక సంవత్సర ప్రారంభంలో ఈ కంపెనీల్లో 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాల సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కంపెనీలు ఉద్యోగులు 20.6 లక్షలుగా ఉంది.
ఈ కాలంలో మొత్తం 51,744 మంది ఉద్యోగులు తగ్గారు. ఈ కాలంలో చాలా ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు చేయడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. రిక్రూట్‌మెంట్‌ను దాదాపు అన్ని కంపెనీలు తగ్గించాయి. రానున్న త్రైమాసికాల్లోనూ రిక్రూట్మెంట్లను భారీగా తగ్గించుకుంటున్నట్లు ఐటీ కంపెనీలు ప్రకటించాయి.
టాప్ 10 కంపెనీలుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఎంఫసీస్, ప్రిసిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐ మైండ్ ట్రీ కంపెనీల్లో ఉద్యోగులు సంఖ్య తగ్గడం 25 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఆయా ఐటీ కంపెనీలు వెల్లడించిన ఆర్ధిక ఫలితాల ప్రకారం 2021-23 ఆర్ధిక సంవత్సరాల్లో ఉద్యోగులు వివరాలు ఇలా ఉన్నాయి. 2022 సెప్టెంబర్‌లో అత్యధికంగా టీసీఎస్ 6,16,171 మంది, విప్రోలో 2,62,626 మంది టెక్ మహీంద్రా 1,63,912 మంది, ఎల్టీఐ మైండ్‌ట్రీ 86,936 మంది ఉన్నారు.
2022 డిసెంబర్ నాటికి ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో కాగ్నిజెంట్‌లో 3,55,300 మంది, ఇన్ఫోసిస్‌లో 3,46,845 మంది, 2023-24 ఆర్ధిక సంవత్సరం 2వ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించే సమయానికి టీసీఎస్‌లో 6,06,985 మంది, విప్రోలో 2,44,707 మంది, టెక్ మహీంద్రాలో 1,50,604 మంది, ఎల్టీఐ మైండ్‌ట్రీలో 85,532 మంది, కాగ్నిజెంట్‌లో 3,45,600 మంది, ఇన్ఫోసిస్‌లో 3,28,764 మంది, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 2,21,139 మంది, ప్రిసిస్టెంట్ సిస్టమ్స్‌లో 22,842 మంది, ఎంఫసిస్‌లో 33,771 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు వెల్లడించిన సమయంలోనే రానున్న త్రైమాసికాల్లో ఉద్యోగ నియామకాలు మరింత తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లను నిలిపివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నిరంజన్ రాయ్ ప్రకటించారు. కొత్త రిక్రూట్మెంట్కు వెళ్లడానికి బదులు ముందుగా ఆన్‌బోర్డింగ్ వెయింటింగ్‌లో ఉన్న వారిని తీసుకోవాల్సి ఉందని విప్రో వెల్లడించింది.
ఎదురు చూస్తున్న వారికి రానున్న త్రైమాసికాల్లో దశలవారిగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఐటీ డిమాండ్ చాలా బలహీనంగా ఉందని టీసీఎస్ కొత్త సీఈఓ కె. కృతివాసన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల మూలంగా ఐటీ రంగంలో అనిశ్చితి ఏర్పడిందని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.