Thursday, November 21, 2024

ఫిబ్రవరిలో తగ్గిన క్రెడిట్‌ కార్డుల జారీ

దేశంలో క్రెడిట్‌ కార్డుల జారీ, వాటి జరిగే వ్యయం కూడా ఫిబ్రవరి నెలలో తగ్గింది. రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరిలో క్రెడిట్‌ కార్డుల ద్వారా 1.19 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇది జనవరిలో 1.28 లక్షల కోట్లుగా ఉంది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో 3 రోజులు తక్కువగా ఉందని, అందువల్లే వ్యయంలో కొంత తగ్గుదల కనిపిస్తోందని యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ పేమేంట్స్‌ డివిజన్‌ హెడ్‌ సంజీవ్‌ మోఘే అభిప్రాయపడ్డారు. క్రెడిట్‌ కార్డుల మొత్తం అవుట్‌స్టాండింగ్‌ 8.33 కోట్లుగా ఉంది. వార్షిక పెరుగుదల రేటు 16.3 శాతంగా నమోదైంది. అదే సమయంలో ఫిబ్రవరిలో క్రెడిట్‌ కార్డుల వృద్ధి మాత్రం చాలా తక్కువగా 1.2 శాతం మాత్రమే నమోదైంది. జనవరిలో 8.24 కోట్ల క్రెడిట్‌ కార్డులు జారీ చేశారు.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫిబ్రవరిలో 4,258 కోట్లు వ్యయం చేశారు. ఇది జనవరిలో 4,148 కోట్లుగా ఉంది.జనవరిలో పండుగల సీజన్‌ కావడం, పలు కంపెనీలు డిస్కౌంట్‌ సేల్స్‌ ప్రకటించడం వంటి కారణాల వల్ల జనవరిలో క్రెడిట్‌ కార్డుల వినియోగం సాధారణంగానే ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో ఎలాంటి డిస్కౌంట్లు లేకపోవడం, ఇతర కారణాల మూలంగా ఖర్చు తగ్గిందని వారు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో క్రెడిట్‌ కార్డుల జారీ కూడా తగ్గింది. ఎస్‌బీఐ కార్డ్స్ డివిజన్‌ ఫిబ్రవరిలో 3 లక్షల కార్డులు జారీ చేసింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 2 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 80 వేల కార్డులను జారీ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement