Saturday, November 23, 2024

Airfare | దీపావళి సీజన్‌లో తగ్గిన విమాన ఛార్జీలు

దేశంలో చాలా రూట్లలో దీపావళి సీజన్‌లో విమాన ప్రయాణ ఛార్జీలు 20-25 శాతం వరకు తగ్గాయి. గత సంవత్సరం దీపావళి సమయంలో చాలా రూట్లలో ఉన్న విమాన ఛార్జీలతో పోల్చుకుంటే ఈసారి తక్కువగా ఉన్నాయి. విమాన ఛార్జీలు తగ్గడానికి ప్రధానంగా ఇటీవల కాలంలో తగ్గిన ఇంధన ధరలు, ఆయా రూట్లలో పెరిగిన సర్వీస్‌లు ఒక కారణమని ప్రముఖ ట్రావెల్‌ సైట్‌ ఇక్సిగో తెలిపింది.

30 రోజుల ముందుగా కొనుగోలు చేసిన టికెట్ల రేట్ల ఆధారంగా ఇక్సిగో ఈ నివేదికను రూపొందించింది. గత సంవత్సరం నవంబర్‌ 10 నుంచి 16 వరకు ఉన్న దీపావళి సీజన్‌లో ఉన్న ఛార్జీలను ఈ సారి అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు ఉన్న ఛార్జీలతో సరిపోల్చారు.

బెంగళూర్‌ నుంచి కోల్‌కతాకు సగటు ఛార్జీలు 38 శాతం తగ్గాయి. ఈ రూట్‌లో గత దీపావళి సీజన్‌లో సగటు టికెట్‌ ధర 10,195 రూపాయలు ఉంటే, ఈ సారి అది 6,319 రూపాయలుగా ఉంది. చైన్నయ్‌ నుంచి కోల్‌కతాకు ఈ సారి టికెట్‌ ఛార్జీలు 36 శాతం తగ్గాయి. గత సంవత్సరం దిపావళి సీజన్‌లో టికెట్‌ ధర 8,725 రూపాయల ఉంటే ఈ సారి ఇది 5,604 రూపాయలుగా ఉంది.

ముంబై- ఢిల్లి రూట్‌లో ఛార్జీలు 34 శాతం తగ్గాయి. గత సంవత్సరం ఈ రూట్‌లో టికెట్‌ 8,788 రూపాయలుగా ఉంటే, ఈ సారి అది 5,762 రూపాయలుగా ఉంది. ఢిల్లి- ఉదయ్‌పూర్‌ మధ్య టికెట్‌ ధర 34 శాతం తగ్గింది. గత సంవత్సరం 11,296 రూపాయలుగా ఉంటే, ఈ సారి అది 7,469 రూపాయలుగా ఉంది.

వీటితో పాటు ఢిల్లి-కోల్‌కతా, హైదరాబాద్‌- ఢిల్లి, ఢిల్లి- శ్రీనగర్‌ రూట్‌లో గత సంవత్సరం కంటే ఈ సారి విమాన ఛార్జీలు 32 శాతం తగ్గాయి. గత సంవత్సరం దిపావళీ సీజన్‌లో గోఫస్ట్‌ విమాన సర్వీస్‌లు రద్దు కావడంతో సర్వీస్‌లు గణనీయంగా తగ్గాయి. దీంతో ఈ రూట్లలో ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. ఈ సారి పరిస్థితి మారింది. ఈ రూట్లలో సర్వీస్‌లు పెరిగాయి.

- Advertisement -

దీనితోడు ఇంధన ధరలు కూడా తగ్గడంతో సగటున ఛార్జీలు 20-25 శాతం తగ్గాయని ఇక్సిగో గ్రూప్‌ సీఈఓ అలోక్‌ బాజ్‌పాయ్‌ చెప్పారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి ఇంధన ధరలు 15 శాతం తగ్గినట్లు ఆయన తెలిపారు. కొన్ని రూట్లలో మాత్రం గత సంవత్సరం కంటే ఛార్జీలు 34 శాతం పెరిగాయి. ప్రధానంగా అహ్మదాబాద్‌- ఢిల్లి రూట్‌లో టికెట్‌ ధరలు 34 శాతం పెరిగాయి.

గత సంవత్సరం ఈ రూట్‌లో 6,533 రూపాయలు ఉంటే ఈ సారి ఛార్జీలు 8758 రూపాయలకు చేరాయి. ముంబై- డెహ్రాడూన్‌ రూట్‌లో ఛార్జీలు 33 శాతం పెరిగాయి. గత సంవత్సరం ఈ రూట్‌లో విమాన ఛార్జీలు 11,710 రూపాయలు ఉంటే ఈ సారి అవి 15,527 రూపాయలకు చేరుకున్నాయని ఇక్సిగో నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement