Friday, November 22, 2024

ఎగవేతదారుల భరతం పట్టేలా రికవరీ యాక్టు.. జీఎస్టీ ఎగవేతదారులపై చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పెండింగ్‌ బకాయిల వసూలుకు అవకాశమిచ్చిన వాణిజ్య పన్నుల శాఖ మరో కీలక చర్యగా దిశగా శ్రీకారం చుడుతోంది. కఠిన చర్యలతోనే అక్రమార్కులకు చెక్‌ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రంనుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో ఎదురవుతున్న నిర్లక్ష్యంతోపాటు వ్యాపారుల ఎగవేతతొ పన్నుల వసూళ్‌లు డీలా పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాబడిని పెంచుకునే చర్యలను వేగవంతం చేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వన్‌టైం సెటిల్‌మెంట్‌తోపాటే కఠిన చర్యలు ఏకకాలంలో తీసుకోవాలని యోచిస్తోంది. ఇలా వస్తుసేవల పన్ను వసూలులో మరింత కఠినంగా వ్యవహరించేలా వాణిజ్య పన్నుల శాఖ తీవ్ర చర్యలకు సన్నద్ధమవుతోంది. రాబడి పెంపులో భాగంగా జీఎస్టీ అమలుకు ముందు జరిగిన అక్రమాలను గుర్తించి ఎగవేతలపై చర్యలకు సిద్దమవుతోంది. తద్వారా కోల్పోయిన సుమారు రూ. 2వేల కోట్ల పన్నులను రాబట్టుకునేలా ప్రణాళికలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత అక్రమాలకు కారకులైన 10వేల మందికిపైగా వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తోంది. బియ్యం, పప్పు దినుసుల మిల్లర్లు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతిచేసిన సందర్భాల్లో నిబంధనల మేరకు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, కొందరు తప్పుదారిలో 2 శాతమే చెల్లించినట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఇందుకు వే బిల్లులను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. సరుకు రవాణాకు వినియోగించే ఫాం ఎఫ్‌, ఫాం-సీలను అందజేయని వ్యాపారులపై చర్యలకు దిగనున్నారు. వీటిని అందజేయకుండా నకిలీ ఇన్వాయిస్‌లు, బిల్లులతో వ్యాపారం నిర్వహించిన అనుమానితులపై చర్యలు తీసుకునేందుకు నోటీసులనిచ్చి సమాధానమిచ్చేందుకు గడువును నిర్ధేశించారు. వీటి పరిశీలనకు ప్రత్యేకంగా కొందరు అధికారులను కేటాయించారు.

మరోవైపు ఇతర మార్గాల్లో జీఎస్టీ ఎగవేతదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. గడువులోగా తమ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులపై దాడులకు సిద్దమవుతోంది. వస్తు సేవల పన్ను వసూలును మరింత కఠినం చేసి తద్వారా పన్ను రాబడిని మరింతగా పెంచుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 3లక్షలకుపైగా జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు ఉండగా అందులో 20వేలకుపైగా వ్యాపారులు రిటర్నులను దాఖలు చేయడంలేదని గుర్తించారు. మరోవైపు ఈ వే బిల్లులను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. సరుకుల రవాణాను కట్టుదిట్టం చేసేందుకు గతంలో మహా చెక్‌ పేరిట భారీ ఎత్తున స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందుకోసం ప్రతీ 250 మంది డీటర్లకు ఒక ఆఫీస్‌ ఇంచార్జీని నియమించుకుని రహస్యంగా ఆపరేషన్ చేసినట్లుగానే మరోసారి అక్రమంగా సరుకుల రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు.

మరోవైపు రాష్ట్ర అధికారులతోపాటు కేంద్ర జీఎస్టీ అధికారులు కూడా సంచార బృందాలను రహస్యంగా పంపుతున్నారు. గత వ్యాట్‌ బకాయిల వసూళ్లలో భాగంగా పెండింగ్‌ రాబడిపై దృష్టి సారించారు. నోటీసులను ఆన్‌లైన్‌లో పంపుతూ అవరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించి ఆస్తులు జప్తు చేయాలని యోచిస్తున్నారు. పన్నులు చెల్లించకుండా, రిటర్నులను దాఖలు చేయకుండా వ్యవహారం నడుపుతున్న డీలర్ల లెక్కలను వాణిజ్య పన్నుల శాఖ సేకరించింది. జీఎస్టీపై డీలర్లలో జాప్యం పెరిగిందని గుర్తించిన కమిషనర్‌ తాజాగా డిప్యుటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసి జాబితా సిద్దం చేయించారు. ప్రతీ నెలా 20తేదీలోగా వ్యాపారులు తమ రిటర్నులను దాఖలు చేయాలని చట్టంలో ఉంది. ఇంటర్నెట్‌లో జీఎస్‌టీఎన్‌ వెబ్‌సైట్‌లో ఈ మేరకు ఫారాలను సిద్దంగా ఉంచారు. నోటీస్‌ అందిన 15 రోజుల్లో రోజుకు రూ.50 లేట్‌ ఫీజుతోపాటు 18 శాతం అపరాధ రుసుమును వసూలు చేసేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. 15 రోజుల్లో స్పందించని వారిపై కార్యాలయాలు, ఆస్తులపై సోదాలు, ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ ప్రకారం ఆస్తుల జప్తుకు అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులు కసరత్తును వేగవంతం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement