హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఐటీ ఉద్యోగులకు ప్రపంచ ఆర్థిక మాంద్యం కష్టాలు మొదలయ్యాయి. కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాలకుపైగా ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను వెంటనే ఆఫీసులకు రావాల్సిందిగా కంపెనీలు తుది హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ హెచ్చరికలకు స్పందించని వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడానికి కూడా కంపెనీలు వెనుకాడడం లేదని తెలుస్తోంది. అయితే మాంద్యం ప్రభావంతో కంపెనీలు తమ నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సాకుగా చూపి ఉద్యోగుల తొలగింపునకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు పలువురు టెకీలు వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆఫీసుల నుంచి పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 70 శాతం మేర ఉండొచ్చని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) అంచనా వేస్తోంది. మిగిలిన 30 శాతం మంది కూడా వెంటనే ఆఫీసులనుంచి విధులకు హాజరు కావాలని లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ ఐటీ కంపెనీలతో సహా చిన్న కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్స్ పంపుతున్నట్లు చెబుతున్నారు.
కంపెనీలకు కలిసి వచ్చిన మూన్ లైటింగ్…
రెండు సంవత్సరాలకుపైగా ఇంటి నుంచే విధులు నిర్వర్తించిన ఐటీ ఉద్యోగుల్లో కొంత మంది ఇదే అదునుగా ఒకేసారి రెండు కంపెనీల్లో ప్రాజెక్టులు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. మూన్ లైటింగ్‌గా పిలుస్తున్న రెండు కంపెనీల్లో ఒకేసారి పనిచేసే ఈ విధానంపై కొన్ని ప్రముఖ కంపెనీల యాజమన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక పేరొందిన ఐటీ కంపెనీ మూన్ లైటింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరిన్నికంపెనీలు కూడా ఇదే బాటలో వెళుతున్నాయి. మూన్ లైటింగ్‌కు చెక్ చెప్పాలంటే ఉద్యోగులంతా ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందేనని కంపెనీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మాంద్యం మేఘాలు కమ్ముకువస్తున్న వేళ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి మూన్ లైటింగ్ కంపెనీలకు కలిసి వచ్చినట్లు పలు ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
హైబ్రిడ్ మోడల్ ఇక లేనట్లే…
మాంద్యం దెబ్బకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చిన హైబ్రిడ్ మోడల్(వారంలో సగం రోజులు ఇంటి నుంచి మరో సగం రోజులు ఆఫీసు నుంచి పనిచేసుకునే వెసులుబాటు) ఆఫర్ ఇక లేనట్లేనని పలువురు ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రారంభమవుతుండడం, మూన్ లైటింగ్‌ల ప్రభావంతో ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఆఫీసులకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగులను ఇంటి నుంచి విధుల విధానం నుంచి వెనక్కి రప్పించేందుకు మధ్యే మార్గంగా తీసుకువచ్చిన హైబ్రిడ్ మోడల్ ఇక ఉనికిలో ఉండదని వారు పేర్కొంటున్నారు.