Thursday, November 21, 2024

RBI | కమర్షియల్‌ కార్డు చెల్లింపులపై ఆర్‌బీఐ ఆంక్షలు..

కార్డుల ద్వారా కార్పోరేట్లు, స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు చేసే కమర్షియల్‌ చెల్లింపులు నిలిపివేయాలని వీసా, మాస్టర్ కార్డులకు ఆర్‌బీఐ ఆదేశించింది. కార్డు చెల్లింపులను ఆమోదించడానికి అధికారం లేని ఇతర వ్యాపార అవుట్‌లెట్స్‌లలో లావాదేవీలు తాత్కాలికంగా నిలిపివేశారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ ఆదేశాలకు ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియలేదు. కేవైసీ పూర్తి చేయని వ్యాపారుల వైపు కార్డు ద్వారా చేసే చెల్లింపులు జరుగుతుండటాన్ని ఆర్‌బీఐ గమనించి ఉండవచ్చని పరివ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వారి ఖాతాలు కేవైసీ పూర్తి చేసినప్పటికీ, కార్డు చెల్లింపులను ఆమోదించే అధికారం వ్యాపారులుగా వారికి లేకపోవచ్చని మరో కారణంగా చెబుతున్నారు.

తదుపరి నోటీస్‌ వచ్చే వరకు కమర్షియల్‌ కార్డుల ద్వారా చేసే వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని ఈ రంగంలో పని చేసే ఫిన్‌టెక్లకు ఆర్‌బీఐ నుంచి ఆదేశాలు వచ్చాయని నోటీస్‌ అందుకున్న ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు ఒకరు తెలిపారు. ప్రధానంగా రెంటల్‌, ట్యూషన్‌ చెల్లింపులు ఆర్‌బీఐ నిర్ణయం వల్ల ప్రభావం అవుతాయన్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ ఆదేశాలతో కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు ఈ తరహా చెల్లింపులను నిలిపివేశాయి. కస్టమర్లు తమ కార్డుల ద్వారా క్రిడ్‌, పేటీఎం, నోబ్రోకర్‌ వంటి యాప్‌ల ద్వారా ఇలాంటి చెల్లింపులు చేస్తున్నారు.

సాధారణంగా బిజినెస్‌ చెల్లింపులు ఎక్కువగా నెట్‌ బ్యాంకింగ్‌, ఆర్‌టీజీఎస్‌ ద్వారా పెద్ద మొత్తాలను ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటారు. కమర్షియల్‌ చెల్లింపులు సాధారణంగా కార్డుల ద్వారా జరగవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫిన్‌టెక్‌ సంస్థలు, కార్డు సంస్థలు బిజినెస్‌ వెండర్స్‌ చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తేనే ఇలాంటి చెల్లింపులు జరుగుతాయని భావిస్తున్నారు. ఇలాంటి చెల్లింపులు వెండర్స్‌కు, సప్లయర్స్‌కు జరుగుతుంటాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం కార్డుల ద్వారా కమర్షియల్‌ చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు వీసా, మాస్టర్‌కార్డులు ఫిన్‌టెక్‌ సంస్థలకు తెలిపాయి.

కొన్ని సంస్థలు పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ తీసుకోకుండానే ఇలా కార్డుల చెల్లింపులను అనుమతి ఇస్తున్నాయని, ఆర్‌బీఐ వీటిని అదుపు చేసేందుకే ఇలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చాలా ఫిన్‌టెక్‌ సంస్థలు కార్డుల ద్వారా ట్యూషన్‌ ఫీజులు, రెంటల్స్‌ చెల్లింపులకు అనుమతి ఇస్తున్నాయి. ఇలాంటి వాటిపైనే ఆర్‌బీఐ కొరడా ఝళిపించిందని ఒక ఫిన్‌టెక్‌ సంస్థకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. పేటీఎం పేమేంట్స్‌ బ్యాంక్‌పై ఆంక్షలతో ఆర్‌బీఐ ఇతరహా చెల్లింపులు చేస్తున్న ఫిిన్‌టెక్‌లపై దృష్టి సారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement