Friday, November 22, 2024

రెయిన్‌బో చిల్డ్రన్‌ లిస్టింగ్‌.. 6.64 శాతం క్షీణత

హైదరాబాద్‌ : రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం లిస్ట్‌ అయ్యింది. కంపెనీ షేరు బీఎస్‌ఈలో 6.64 శాతం తగ్గింపుతో రూ.506 వద్ద లిస్టు అయ్యింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.510 వద్ద లిస్టు అయ్యింది. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల గంట మోగించి షేర్‌ లిస్టింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్‌ డాక్టర్‌ దినేష్‌, పద్మ కంచర్ల, లిస్టింగ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ రచన భుసారీతో పాటు తదితరులు లిస్టింగ్‌ సర్మనీలో పాల్గొన్నారు. రెయిన్‌ బో చిల్డ్రన్‌ మెడికేర్‌ ఇష్యూ ధర ఒక్కో షేర్‌కు రూ.542గా ఉంది. స్టాక్‌ బలహీనమైన లిస్టింగ్‌ కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోయారు. పెట్టుబడిదారుడు ఒక షేరుపై రూ.36 వరకు నష్టపోయాడు. ఈ ఐపీఓ ఏప్రిల్‌ 27న ప్రారంభమైంది. 29న ముగిసింది. ఈ ఇష్యూకు నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎన్‌ఐఐ), రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి కొంత స్పందన వచ్చినా.. లిస్టింగ్‌ తరువాత రెయిన్‌ బో చిల్డ్రన్‌ మెడికేర్‌ స్టాక్‌ మరింత దిగజారింది. రూ.542 వద్ద లిస్ట్‌ అయిన స్టాక్‌.. అత్యధికంగా 517.90 వరకు వెళ్లింది. కనిష్టంగా 421.65ను తాకింది. చివరికి 16.94 శాతం నష్టపోయి.. రూ.450.20 వద్ద ముగిసింది. ఈ షేర్‌ బీఎస్‌ఈలో రూ.542 వద్ద లిస్టింగ్‌కు వచ్చింది. అత్యల్పంగా రూ.421.00 వరకు వెళ్లింది. చివరికి రూ.450.10 వద్ద క్లోజ్‌ అయ్యింది.

రూ.1,581 కోట్ల సేకరణ..

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా.. కంపెనీ.. రూ.1581 కోట్లను సేకరించింది. ఇందులో రూ.280 కోట్లు రుణం చెల్లింపు, కొత్త ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించనున్నారు. షేర్లను విక్రయించే వాటాదారులకు రూ.1,300.8 కోట్లు లభిస్తాయి. రెయిన్‌ బో చిల్డ్రన్‌ మెడికేర్‌ తన ఉద్యోగుల కోసం ఇష్యూలో 3లక్షల షేర్లను రిజర్వ్‌ చేసింది. ఇష్యూలో పాల్గొన్న ఉద్యోగులు తుది ఆఫర్‌ ధరలో ఒక్కో షేర్‌కు రూ.20 తగ్గింపు పొందారు. ఐపీఓ కింద రూ.280కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేశారు. బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పీఎస్‌సీ-మద్దతుగల గ్రూప్‌ దక్షిణ భారతదేశంలో 14 ఆస్పత్రులను నిర్వహిస్తోంది. దీని మొత్తం పడకల సామర్థ్యం 1500గా ఉంది. పీడియాట్రిక్‌, ఇందులో నియోనాటల్‌, పీడియాట్రిక్‌ ఐసీయూ సదుపాయాలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement