ఎయిరిండియా టాప్ మేనేజ్‌మెంట్‌లో సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సమూల మార్పులు చేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా టాటా సన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న నిపున్ అగర్వాల్, చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్‌గా టాటా స్టీల్‌లో 2012-21 మధ్య పని చేసిన సురేశ్‌దత్ త్రిపాఠిని నియమించారు. ఎయిరిండియా-టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎయిరిండియాలో పనిచేసిన ప్రముఖులు మీనాక్షి మాలిక్, అమృత శరణ్‌లను ఎయిరిండియా సీఈవోకు అడ్వైజర్లుగా నియమించారు. ఇంకా ఎయిరిండియాకు సీఈవోను నియమించలేదు. అప్పటి వరకు మీనాక్షి మాలిక్, అమృత శరణ్.. చంద్రశేఖరన్‌కు అడ్వైజర్లుగా పని చేస్తారు.
ఇక ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పనిచేసిన సత్య రామస్వామిని ఎయిరిండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమించారు. ఎయిరిండియా కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ అధిపతిగా రాజేశ్ దోగ్రా నియమితులయ్యారు. ఎయిరిండియా వెటరన్ ఆర్ ఎస్ సంధు ఇక ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్‌గా.. వినోద్ హెజ్‌మాదీని సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా నియమించారు. ప్రస్తుతం నియమితులైన ఎయిరిండియా కొత్త అధికారులు సంస్థ ప్రతినిధి బృందంగా కూడా వ్యవహరించాలి. కొత్త బాధ్యతల్లో మెరుగైన సేవలందించాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రశేఖరన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గతేడాది సాగిన వేలం ప్రక్రియలో 2021 అక్టోబర్ 8న ఎయిరిండియాను టాటా సన్స్ అనుబంధ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేంద్రం రూ.18 వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.