Tuesday, November 26, 2024

Followup : లాభాలొచ్చాయ్‌, ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకొచ్చాయి. వరుసగా ఆరు సెషన్స్‌లో నష్టాలు చవి చూసిన సూచీలు సోమవారం సానుకూలంగా ప్రారంభమై.. కొంత పైకి వెళ్లి.. చివర్లో స్వల్పంగా పతనం అయ్యాయి. చాలా రోజుల తరువాత.. దేశీయ మార్కెట్‌ లాభాలతో వారాన్ని ప్రారంభించింది. ఉదయం సెన్సెక్స్‌ 52,946.32 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,428.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,632.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 180.22 పాయింట్ల లాభంతో.. 52,973.84 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,845.10 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో నిఫ్టీ 15,977.95 పాయింంట్ల వద్ద గరిష్టాన్ని, 15,739.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 60.15 పాయింట్లు లాభపడి 15,842.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.80 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

దన్నుగా నిలిచిన బ్యాంకు సూచీలు..

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో స్థిరపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 476 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ సూచీ 340 పాయింట్ల మేర లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ షేర్లు మాత్రం కొంత ఒత్తిడికి గురయ్యాయి. ఆ తరువాత అమ్మకాల ఊతంతో సూచీలు లాభాలబాటపట్టాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ దాదాపు 3 శాతం పెరగగా.. నిఫ్టీ రియాల్టి 2.5 శాతం, నిఫ్టీ ఆటో 2 శాతానికిపైగా లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌, ఫైనాన్షియల్స్‌, మెటల్‌ ఒక్కొక్కటి ముగింపులో 0.5 శాతం-1.5 శాతం మేర మధ్య పెరిగాయి.

6 రోజుల నష్టాల తరువాత..

అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. 6 రోజుల వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపారు. మరోవైపు ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా దేశీయ సూచీలకు దన్నుగా నిలిచాయి. స్విస్‌ సిమెంట్‌ అగ్రగామి సంస్థ హోల్సిమ్‌కు చెందిన భారత్‌ వ్యాపారాన్ని 10.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.81,361 కోట్లు)తో స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. హోల్సిమ్‌కు అంబుజా సిమెంట్‌లో 63.19 శాతం, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉన్నాయి. ఏసీసీలో 50.05 శాతం వాటా అంబుజాకు ఉంది. అంటే ఏసీసీలో 54.53 శాతం వాటా హోల్సిమ్‌కు ఉంది. ఈ నేపథ్యంలో అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన బకాయిల్లో 33 శాతం వాటాను ఈక్విటీ కిందకు మార్చేందుకు సర్కార్‌ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ వార్తలతో ఇంట్రాడేలో ఈ కంపెనీ షేర్లు 15 శాతం మేర లాభపడ్డాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement