Friday, November 22, 2024

ఇట్లయితే బంక్‌లు నడపలేం.. కేంద్రానికి లేఖ రాసిన ప్రైవేటు చమురు సంస్థలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా, దేశీయంగా ధరలు సవరించకపోవడ వల్ల తాము నష్టపోతున్నామని, ఇలా అయితే తాము పెట్రోల్‌ బంక్‌లు నడపలేమని ప్రయివేట్‌ చమురు సంస్థలు కేంద్రానికి లేఖ రాశాయి. రేట్లు సవరించకపోవడంతో లీటర్‌ డీజిల్‌ పై 20-25 రూపాయల వరకు, పెట్రోల్‌ పై లీటర్‌కు 14-18 రూపాయలు నష్టపోతున్నామని జియో-బీపీ, నైరా, షెల్‌ కంపెనీలతో కూడిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ప్రెటోలియం ఇండస్ట్రీ (ఎఫ్‌ఐపిఐ) ఈ నెల 10న చమురు మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నా, దేశీయంగా వీటి రేట్లను సవరించడంలేదు. ద్రవ్యోల్బణం పెరగడానికి చమురు ధరలు కూడా ఒక కారణంగా ఉన్నందు ప్రభుత్వం వీటిని పెంచడంలేదు. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు కూడా వివీటి రేట్లను సవరించడంలేదు. చివరిసారి గత మార్చి నెలలో వరసగా 14 రోజుల పాటు 80 పైసలు చొప్పున వీటి రేట్లు పెంచారు. ఇలా సవరించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బల్క్‌ వినియోగదారులకు రేట్లను పెంచుకోవడానికి అనుమతించారు. దీంతో బల్క్‌ వినియోగదారులు రిటైల్‌ బంక్‌ల్లో డీజిల్‌, పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. అందు వల్ల కేంద్రం వెం టనే జోక్యం చేసుకుని రేట్లు పెంచాలని కోరారు. రేట్లు పెంచకుంటే భవిష్యత్‌లో తమ వ్యాపారాల విస్తరణపై ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం రేట్లను సవరించన ప్పటికీ, కొన్ని ప్రయివేట్‌ సంస్థలు ఎక్కువ రేటుకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తున్నాయి. దీంతో వాహనదారులు ప్రభుత్వ బంక్‌లకు వస్తున్నారు. ఫలితంగా చాలా చోట్ల నో స్టాక్‌ బోర్డులు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఇటీవల యూనివర్సల్‌ సర్వీస్‌ అబ్లిగేషన్‌ పరిధిని విస్తరించింది. దీని ప్రకారం లైసెన్స్‌ పొందిన చమురు సంస్థలు తమ బంక్‌ల్లో తగిన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. లేదంటే లైసెన్స్‌లు రద్దు చేస్తామని కేంద్రం హెచ్చరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement