Friday, November 22, 2024

సింగరేణిపై ప్ర‌ధాని మోదీ మాయ మాటలు.. ప్రైవేటీకరణ అసాధ్యమనే బ్లాకుల విక్రయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటైజేషన్లలో పేరుగాంచిన కేంద్రంలోని మోడీ సర్కార్‌ తెలంగాణ పర్యటనలో సన్నాయి నొక్కులు నొక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటికరణ, తెగనమ్ముకొవడంలో పెద్దన్న పాత్ర పోషించి డిజిన్వెస్ట్‌మెంట్లతో జాతి సంపదను పరాయీకరణ చేస్తున్న ప్రధాని మోడీ నోటివెంట సింగరేణి ప్రైవేటీకరణ అంశం వెలువడటంపై తెలంగాణ ప్రజలు ఆయన వ్యాఖ్యల్లోని లోతుపాతులను ఆరా తీస్తున్నారు. ప్రతీసారి తెలంగాణపై విషం చిమ్ముతూ, రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావిస్తూ సవతి తల్లి ప్రేమను ప్రదర్శిచే ప్రధాని నోటివెంట సింగరేణి ప్రైవేటీకరణ లేదనే వ్యాఖ్యల వెనుక అంతరంగం వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రైవేటీకరణ అసాధ్యమని తెలిసిన ప్రధానితోపాటు, పాలక పార్టీ పెద్దలు సింగరేణి నిర్వీర్యం దిశగా బ్లాకుల ప్రైవేటీకరణతో కొత్త పాచికలు వేస్తున్నారని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా మరోసారి సింగరేణి ఉద్యోగులు, తెలంగాణ ప్రజలను ప్రధాని మోడీ మాయ మాటలతో బురిడీ కొట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 51శాతం తెలంగాణ వాటా ఉంటే కేంద్రం ఎలా ప్రైవేట్‌ పరం చేస్తుందని ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ప్రస్తావించడంపై అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సింగరేణిని ప్రైవేట్‌పరం చేయరుకానీ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు కేటాయించనున్నారనే ప్రచారం జోరందుకుంటోంది. తద్వారా సింగరేణిని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతోందన్న వ్యాఖ్యలు తాజాగా ఊపందుకున్నాయి. తెలంగాణ వాటా సింగరేణిలో 51శాతం ఉండి, ప్రైవేటైజేషన్‌కు తెలంగాణ విముఖంగా ఉన్నందునే ప్రైవేటుపరం చేయలేకపోయారని మేధావులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

లేకపోతే కేంద్రం ఎప్పుడో దీనిని ప్రైవేటు పరం చేసేదని అంటున్నారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే, ఐఓసీల తరహాలో ఏనాడో సింగరేణిని ప్రైవేటుపరం చేసేవారని చెబుతున్నారు. అందుకే తెలంగాణలో కొత్త బ్లాకులు సింగరేణికి కేటాయించాల్సిపోయి కక్షపూరితంగా ప్రైవేట్‌ సంస్థల లబ్ది కోసమే కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించిందని అంటున్నారు. వేలంలో ప్రైవేటు సంస్థలనుంచి స్పందన లేకపోయినా మళ్లిమళ్లి వేలం నిర్వహిస్తూ ఇప్పటికే ఒక బ్లాక్‌ను ప్రైవేట్‌కు కేటాయించడాన్ని ఉదహరిస్తున్నారు. నూతన బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు ఇచ్చి, బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి సంస్థను ప్రైవేట్‌ పరం చేయడంతో ఏమి లాభమని కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు నిలదీస్తున్నారు.

జాతి సంపద విక్రయాల్లో మోడీ టాప్‌…

జాతి సంపద అమ్మకాల్లో గతంలో ఏ ప్రధానికి దక్కని గౌరవం ప్రధాని మోడీకి దక్కుతోంది. 70ఏళ్లలో భారత దేశ చరిత్రలో 28శాతం విక్రయించగా, మోడీ హయాంలో 72శాతం ప్రైవేటుకు జాతి సంపదను విక్రయించారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో జాతి సంపదను అమ్మేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. గత పాలకులు, ప్రభుత్వాలు వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తే, మోడీ సర్కార్‌ విచ్చలవిడిగా లక్షల కోట్ల ఆస్తులను విక్రయిస్తున్నదని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. జాతి సంపద విక్రయాలతో గత ప్రభుత్వాలు రూ. 1,76,747కోట్లు సొమ్ము చేసుకోగా, బీజేపీ సారధ్యంలోని మోడీ సర్కార్‌ రూ. 4,46,000 కోట్ల జాతి సంపదను తెగనమ్మి సోమ్ము చేసుకుంది. మొత్తం జాతి సంపదను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రధాని మోడీ 72శాతం అంటే గత ప్రభుత్వాలకంటే రెండున్నర రెట్టు అధికంగా జాతి సంపదను పరాయీకరణ చేసి దేశభక్తిని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement