అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశంలో కంపెనీలు చమురు ధరలను పెంచుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దీంతో తెలంగాణలో తొలిసారిగా ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర సెంచరీ మార్కును తాకింది. హైదరాబాద్ నగరంలో ఐవోసీఎల్ ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర రూ.100.63కి చేరగా హెచ్‌పీసీఎల్ పవర్ పెట్రోల్ ధర రూ.100.13, బీపీసీఎల్ స్పీడ్ పెట్రోల్ ధర రూ.99.09కి చేరింది.
అటు హైదరాబాద్‌లో సాధారణ పెట్రోల్ లీటరు ధర రూ.1.64 పెరిగి రూ.96.50కి చేరింది. పెట్రోల్‌తో పాటే డీజిల్ ఎగబాకుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.1.93 పెరిగి రూ.91.04గా పలుకుతోంది. గత పది రోజుల్లో పెరిగిన ధరల కారణంగా తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై సుమారు రూ.25 కోట్ల భారం పడినట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగింది. గత ఏడాది మేలో 1 నుంచి 15 వరకు పెట్రోల్ వినియోగం 72 వేల కిలోలీటర్లుగా ఉండగా, ఈ ఏడాది మే నెలలో పెట్రోల్ వినియోగం లక్ష కిలో లీటర్లను దాటేసింది. డీజిల్ విషయానికి వస్తే గత ఏడాది మే నెలలో 1.70 లక్షల కిలో లీటర్లు ఉండగా, ఈ ఏడాది మే నెలలో 2.05 లక్షల కిలో లీటర్లుగా ఉంది.