Thursday, November 21, 2024

పెండింగ్ జీఎస్టీ పరిహారం నిధులు విడుదల చేస్తాం.. రాష్ట్రాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పెండింగ్‌లో ఉన్న మొత్తం జీఎస్టీ పరిహారం నిధులను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వాలకు భరోసా ఇచ్చారు. శనివారం విజ్ఞాన్ భవన్‌లో ఆమె అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సదస్సులో పాల్గొనగా, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. బుగ్గనతో పాటు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్. గుల్జర్ (ఆదాయపు పన్నులు), రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఎం. గిరిజా శంకర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. గత డిసెంబర్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించిన అంశాల మీదే ప్రత్యేక దృష్టి సారించారు.

జీఎస్టీ పరిహార నిధుల విడుదలపై చర్చించారు. సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ… అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంకా రూ.16,982 కోట్లు జీఎస్టీ పరిహారం బకాయిలున్నాయని, గతేడాది మే 31 వరకూ ఉన్న బకాయిలు ఇప్పటికే చెల్లించినట్లు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు జూన్‌ వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందన్నారు. పరిహార నిధిలో తగినంత వనరులు అందుబాటులో లేనప్పటికీ సొంత వనరుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని ఆమె వెల్లడించారు. భవిష్యత్‍లో వసూలు చేసే సెస్ నుంచి ఆ నిధులను సర్దుబాటు చేస్తామని చెప్పారు.

- Advertisement -

రూ.16,982 కోట్లు జీఎస్టీ పరిహారం చెల్లించేందుకు నిర్ణయించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. తాజా నిర్ణయంతో జీఎస్టీ పరిహార చట్టం 2017 ప్రకారం రాష్ట్రాలకు గత ఐదేళ్లలో బాకీ ఉన్ న మొత్తం పరిహార సెస్ క్లియర్ అవుతుందని స్పష్టం చేశారు. పెన్సిల్, రబ్బర్ వంటి స్టేషనరీపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందన్నారు. డ్యూరబుల్ కంటైనర్లకు ఉపయోగించే ట్యాగ్స్ ట్రాకింగ్ డివైజ్‌లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు.

చిన్న వ్యాపార సంస్థలకు పెనాల్టీ తగ్గింపుపై బుగ్గన హర్షం

రాష్ట్రాలకు జూన్ వరకు ఉన్న బకాయిల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు  మరో రూ.689 కోట్లు జీఎస్టీ పరిహారం కింద రావాల్సి ఉందని తెలిపారు. చిన్న వ్యాపార సంస్థలకు విధించే పెనాల్టీలు తగ్గించడం, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటులో రాష్ట్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం సూచించిన విధంగానే రూ.20 కోట్ల వ్యాపార పరిమాణం ఉన్న సంస్థలు రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినప్పుడు విధించే పెనాల్టీలను సవరించడానికి కౌన్సిల్‌ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అలాగే అప్పిలెట్‌ ట్రిబ్యునల్స్‌లో తీసుకోవాల్సిన సవరణల కోసం మంత్రుల కమిటీ సూచనలను కౌన్సిల్‌ ఆమోదం తెలిపిందని, ఈ మంత్రుల కమిటీలో తాను కూడా సభ్యునిగా ఉన్నట్లు వెల్లడించారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చోటు కల్పించడంతో పాటు, త్వరగా ఏర్పాటు చేయాలన్న సూచనలకు కౌన్సిల్‌ అంగీకారం తెలిపినట్లు బుగ్గన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement