Friday, November 22, 2024

BSE & NSE | ప్రభుత్వ చమురు కంపెనీలకు జరిమానా..

దేశంలోని అతి పెద్ద చమురు సంస్థలపై స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ జరిమానా విధించాయి. ప్రమాణాల ప్రకారం ఆయా కంపెనీల బోర్డుల్లో నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర, మహిళా డైరెక్టర్లు ఉండాలన్న లిస్టింగ్‌ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి.

ఇలా చమురు సంస్థలపై జరిమానాలు విధించడం వరుసగా ఇది ఐదో త్రైమాసికం. జరిమానాకు గురైన కంపెనీల్లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (బీపీసీఎల్‌) ఆయిల్‌ ఇండియా, గెయిల్‌, మంగళూర్‌ రిఫైనరీ వంటి సంస్థలు ఉన్నాయి.

జరిమానాకు సంబంధించిన వివరాలను ఆయా కంపెనీలు ప్రత్యేకంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. ఈ కంపెనీలపై ఎక్స్ఛేంజీలు 2.41 నుంచి 5.46 లక్షల వరకు జరిమానా విధించాయి. బీపీసీఎల్‌కు 2,41,900 రూపాయలు, హెచ్‌పీసీఎల్‌కు 5,36,900 రూపాయలు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌కు, మంగళూర్‌ రిఫైనరీకి 5,36,900 రూపాయల చొప్పున ఫైన్‌ పడింది.

లిస్టింగ్‌ నిబంధనల ప్రకారం కంపెనీలకు ఎగ్జిక్యూటివ్‌ లేదా ఫంక్షనల్‌ డైరెక్టర్ల నిష్పత్తిలో స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌కు స్థానం కల్పించాలి. ఈ నిబంధనలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అమలు చేయడంలేదు. జరిమానా విధిస్తూ పంపించిన నోటీస్‌లపై ఆయా కంపెనీలు స్పందించాయి.

ప్రభుత్వ రంగ సంస్థలుగా తమ కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్ల నియామకం పెట్రోలియం, సహజవాయివు శాఖ చేపడుతుందని సమాధానంలో వివరించాయి. నియామకాలతో కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాయి. ఇది కంపెనీల నిర్లక్ష్యం కాదని తెలిపాయి. అందువల్ల తమపై విధించిన జరిమానాను రద్దు చేయాలని కోరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement