Saturday, November 23, 2024

ప్చ్‌.. మళ్లి నష్టాలే..! 72 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై : భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాల్గో సెషన్‌లోనూ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో రికవరీ కారణంగా నష్టాలు తగ్గాయి. గురువారం (నేడు) ఏప్రిల్‌ రిటైల్‌ లేదా వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. బుధవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54,544.91 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,519.30 పాయింట్ల కనిష్టాన్ని, 54,598.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 276.46 పాయింట్ల నష్టంతో 54,088.39 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16,270.05 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ.. 16,318.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,992 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 72.95 పాయింట్లు నష్టపోయి 16,167.10 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.23 వద్ద ట్రేడ్‌ అవుతున్నది..

భారీగా నష్టపోయిన నిఫ్టీ మెటల్‌..

నిఫ్టీ మిడ్‌ క్యాప్‌-100.. 0.36 శాతం నష్టపోయింది. ఇక స్మాల్‌ క్యాప్‌ 2.91 శాతం క్షీణించింద. సబ్‌ ఇండెక్స్‌లు నిఫ్టీ మెటల్‌ ఏకంగా 5.20 శాతం, నిఫ్టీ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ 2.24 శాతం, నిఫ్టీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2.29 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ ఐటీ 1.24 శాతం, నిఫ్టీ ఆటో సెక్టార్‌ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.69 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, మారుతీ, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో వెల్‌స్పన్‌ ఇండియా ఫలితాలు నిరాశపర్చాయి. దీంతో కంపెనీ షేర్లు ఏకంగా 17 శాతం మేర క్షీణించాయి. మార్చి 2020 తరువాత కంపెనీకి ఇదే అతిపెద్ద ఒకరోజు నష్టం. జీ మీడియా షేర్లు వరుసగా పదో సెషన్‌లోనూ నష్టాలను మూటగట్టుకుంది. బుధవారం 10 శాతం మేర షేర్‌ విలువ క్షీణించింది.

జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు..

మధ్యాహ్న సమయంలో సూచీలు భారీ నష్టాల్లో జారిపోయాయి. ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. అమెరికాలో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులందరూ.. దానిపైనే దృష్టి సారించారు. మరోవైపు ద్రవ్యోల్బణం, మందగమనం సూచనల కారణంగా గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్స్‌లో వీస్తున్న ప్రతికూల పవనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. చైనాలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో షాంఘైతో పాటు పలు నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement