Tuesday, November 26, 2024

పేమెంట్‌ ఇండియా ఐపీఓ.. రూ.1,500 కోట్ల సమీకరణ

ముంబై : ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా చేసుకుని దేశ వ్యాప్తంగా బిజినెస్‌ టు బిజినెస్‌ లావాదేవీలను నిర్వహిస్తోన్న పేమెంట్‌ ఇండియా.. పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ను జారీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ బోర్డుకు సమర్పించింది. రూ.1,500 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సెబీకి అందజేసిన తన డ్రాఫ్ట్‌ రెడ్‌ హర్రెంట్‌ ప్రాస్పెక్టస్‌లో పొందుపర్చింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.375 కోట్లు, పబ్లిక్‌ ఇష్యూను జారీ చేయడం ద్వారా మరో రూ.1,125 కోట్లను సమీకరించుకోవాలని పేమెంట్‌ ఇండియా నిర్ణయించింది. తాను జారీ చేయబోయే పబ్లిక్‌ ఇష్యూల్లో 75 శాతాన్ని క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బయ్యర్స్‌ కోసం కేటాయించింది. మరో 15 శాతం పబ్లిక్‌ ఇష్యూలను నాన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ క్వాలిఫైడ్‌ బిడ్డర్స్‌ కోసం రిజర్వ్‌ చేసింది. మిగిలిన 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు లభిస్తుంది.

ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌తో రూ.225 కోట్లు..

రూ.225 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా సేకరించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. అదే జరిగితే.. ఐపీఓ ద్వారా సేకరించదలిచిన మొత్తం కొంత తగ్గొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించి మొత్తంలో రూ.77 కోట్లు తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకోవడానికి వినియోగిస్తానని పేమెంట్‌ ఇండియా యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌కు ఉంచిన వాటిల్లో ప్రమోటర్‌ షేర్‌ హోల్డర్స్‌ అజయ్‌ ఆదిశేషన్‌ వాటా రూ.134.73 కోట్లు. మరో ప్రమోటర్‌ విశ్వనాథన్‌ సుబ్రమణియన్‌ వాటా రూ.3.29 కోట్లు. సంస్థలో ఇది వరకే పెట్టుబడులు పెట్టిన లైట్‌బాక్స్‌ వెంచర్‌కు చెందిన షేర్ల విలువ రూ.127.38 కోట్లను కూడా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఉంచనుంది. మరో రూ.15.66 కోట్లు విలువ చేసే ఈక్విటీలు మే ఫీల్డ్ ఎఫ్‌వీసీఐ లిమిటెడ్‌కు చెందినవిగా ఉన్నాయి.

ఏజెన్సీల అపాయింట్‌మెంట్‌ పూర్తి..

కాగా పబ్లిక్‌ ఇష్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడం, బుక్‌ రన్నింగ్‌ మేనేజ్‌మెంట్స్‌ వ్యవహరాల కోసం ఏజెన్సీలను కూడా అపాయింట్‌ చేసినట్టు తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌ అండ్‌ కేపిటల్‌ మార్కెట్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ను నియమించుకుంది. షేర్‌ ప్రైస్‌ బ్యాండ్‌, ఇతర కీలక తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. సెబీ నుంచి అనుమతి లభించిన వెంటనే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని తెలిపింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement