Tuesday, November 19, 2024

సొంత వనరుల ఆదాయ వృద్ధి 11.5 శాతానికి.. పెరుగుతున్న రాబడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. తాజా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్‌ 12.9 శాతం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ వృద్ధి రేటును నమోదు చేయడం ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని బహిరంగ బెదిరింపులకు కేంద్రం దిగుతోంది. ఇలా ఈ ఏడాదిలో ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని ఆర్ధిక వర్గాలు భావిస్తున్నాయి. గొప్పలు చెప్పుకుంటున్న మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంనుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.47,312 కోట్లు నిధులు మాత్రమే తెలంగాణకు అందినట్లు లెక్కలు ధృవీకరిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలిస్తే అనేక అంశాలు వెల్లడవుతున్నాయి.

ఇది కేంద్రానికి మింగుడు సపడటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రాష్ట్ర రైతాంగానికి రూ. 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించినట్లు ఆర్థికశాఖ నివేదికద్వారా వెల్లడైంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 84 కోట్ల నిధులను వివిధ క్యాపిటల్‌, ఇతర ఎక్స్‌పెండిచర్‌ చేయగా, సీఎస్‌ఎస్‌ పథకాల కింద కేంద్రంనుంచి అందింది రూ.5200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి రూ.1 లక్షా 84వేల కోట్లకు పెరిగి ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచి ఆర్ధిక పురోగతిలో దూసుకుపోతున్నది.

తెలంగాణ రాష్ట్రంలో ఉత్పాదక రంగానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఇరిగేషన్‌ రంగంలో అద్భుత పురోగతితో పంటల సాగు పెరిగింది. ఐటీ, ఇతర రంగాల్లో పురోగతితో సంపద పెరిగి రాష్ట్ర జీఎస్‌డీపీ రెట్టింపవుతున్నది. ఆర్ధిక సమన్వయంలో భాగంగా అర్ధవంతమైన ఉపాధిని పెంచేందుకు, తద్వారా ప్రజల హోదాను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతం కావడంతో పేదరికం తగ్గింది. విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు ప్రజలకు మిరంత విస్తృతమయ్యాయి.
ఈ ఏడాదిలో రైతు రుణమాఫీకి రూ. 17,500కోట్లు, రైతు బంధుకు రూ. 15000కోట్లు, ఆసరా పించన్లకు రూ. 10వేల కోట్లు, నిరుద్యోగ భృతికి రూ. 3వేల కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు రూ. 30వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ. 5వేల కోట్లు, ఆరోగ్య శ్రీ సేవలకు రూ. 1000 కోట్లు, సబ్సిడీ బియ్యానికి రూ. 3వేల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసినప్పటికి కొన్ని పథకాలపై సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాదిలో కొత్త పథకాలు అమలు, పాత పథకాల కొనసాగింపుతోపాటు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పించన్లు రెండింతలు, వయో పరిమితి 57 ఏళ్లకు తగ్గించడం, కొత్తగా అర్హత సాధించనున్న 10లక్షల మందికి పింఛన్‌ అందజేతకు సర్కార్‌ శ్రీకారం చుట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement