న్యూఢిల్లి : భారత వెలుపల కూడా విస్తరణ, గ్లోబల్ మార్కెట్లను కొల్లగొట్టేందుకు దేశీయ స్టార్టప్‌లకు ఏడాదికి 40 – 50 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ టీవీ మోహన్‌దాస్ పేయి పేర్కొన్నాయి. భారత్‌కు టెక్ టాలెంట్ లేక కాదు. ఐటీ రంగం, టెక్ స్టార్టప్స్ ఉమ్మడిగా 1.5 మిలియన్ మంది ఇంజనీర్లకు ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న పదేళ్లలో ఈ సంఖ్య 10 మిలియన్లకు చేరే అవకాశాలున్నాయి. మరింత వృద్ధి సాధించేందుకు కావాల్సిందల్లా మూలధనంతో టెక్ టాలెంట్‌కు మద్దతివ్వడమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వీసీ సంస్థ ఆరిన్ క్యాపిటల్‌కు పేయి చైర్మన్‌గా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సెంట్రర్స్ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ), బ్లూమ్‌బర్గ్ ఉమ్మడిగా నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ఫిన్‌టెక్ స్టార్టప్స్ దేశంలో ఫైనాన్సియల్ సేవలు వ్యక్తుల వరకు చేరడంలో దోహదపడ్డాయని మోహన్‌దాస్ అన్నారు. యూపీఐ విధానం అందుబాటులోకి రాకముందు ఒక వ్యక్తి ఆర్థిక లావాదేవీ బ్యాంకుల దయపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఆ వ్యక్తే తనకు నచ్చిన సమయంలో కేవలం 30 సెకన్లలోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ చెయిన వంటి టెక్నాలజీలు క్రమంగా ఫైనాన్సియల్ సంస్థల పాత్రను తగ్గిస్తాయని, అయితే భవిష్యత్‌లో కూడా బ్యాంకులు కీలకమైన భూమిక పోషిస్తూనే ఉంటాయని మోహన్‌దాస్ చెప్పారు.