మన దేశం ఎప్పటికైనా చైనాకు పోటీ ఇవ్వగలదని చాలా మంది భావిస్తున్నారు. తయారీ రంగంలో దూసుకుపోతున్న ఇండియా ఈ విషయంలో చైనాకు పోటీ ఇచ్చే స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో చైనాకు, ఇతర పాశ్చత్య దేశాలకు ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్ సమస్య, ఇతర అంశాలపై విబేధాలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఈ దేశాలు భారత్ వైపు చూసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వేసిన అంచనాలు వాస్తవ రూపం దాల్చే సమయం వచ్చింది. అమెరికాకు క్రిస్మస్ అలంకరణ వస్తువులు, టీ షర్టులు ఎగుమతి చేస్తున్న తొలి 5 దేశాల జాబితాలో భారత్‌కు చోటు లభించింది. అమెరికా కస్టమ్స్ సమాచారం ప్రకారం గత నెలలో సముద్ర మార్గాన అమెరికాకు ఎగుమతి అయిన పండుగ వస్తువులు, ఉపకరణాల విలువ 20 మిలియన్ డాలర్లకు చేరింది. గత సంవత్సరంతో పోల్చితే ఇది మూడింతలు అధికం. ఈ విషయంలో మన దేశం ఫిలిఫ్పైన్స్‌ను అధికమించింది.
చైనాలో కొవిడ్ నిబంధనలు కఠినతరంగా ఉంటడం, కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలతో దిగుమతిదారులు ఇండియా వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా క్రిస్మస్ సంబంధించిన అలంకరణ వస్తువుల వ్యాపారంలో చైనా వాటానే ఎక్కువ. కొత్త కొనుగోలుదారులు మాత్రం భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్రిస్మస్ సంబంధించిన వస్తువులే కాకుండా దుస్తులు, హస్తకళలకు సంబంధించిన వస్తువులు, ఇతర పరికరాలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే యూఎస్ వ్యాపారులు తమ కొనుగోలు వనరులను పెంచుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో మన దేశానికి పెద్దగా ప్రయోజనం కలగలేదు. బీజింగ్ నుంచి తరలిపోయిన అనేక ఆర్డర్లు వియత్నాంకు చేరాయి. కరోనాతో పరిస్థితి మారింది. ఈ విషయంలో చైనా జీరో కరోనా పాలసీని తీసుకుంది. ఫలితంగా సరఫరాల్లోనూ ఇబ్బందులు వచ్చాయి. కార్మికుల వేతనాలు పెరిగాయి. దీంతో అమెరికా వ్యాపారులు, తైవాన్, ఐరోపా సమాఖ్య, జపాన్ వంటి దేశాలు మన దేశం వైపు ఊడడం ప్రారంభమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 420 బిలియన్ డాలర్లకు చేరిదంది. ఈ సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే ఇందులో సగానికి అధిగమించడం విశేషం. ఆదే సమయంలో చైనా ఎగుమతుల విలువ 3.38 ట్రిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్రిస్మస్ అలంకరణ వస్తువుల ఎగుమతుల విలువ 2020 నాటితో పోల్చితే 54 శాతం పెరిగాయి. హస్తకళలకు సంబంధించిన వస్తువుల ఎగుమతుల విలువ 32 శాతం పెరిగాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనా క్రమంగా దూరం అవుతుండటం, మన దేశానికి కలిసి వస్తోంది. 2030 నాటికి మన దేశంలో అపారమైన మానవ వనరులు అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది. అప్పటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. అమెరికాకు మన దేశం నుంచి కాటన్ టీషర్టు ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ విషయంలో ఎల్‌సాల్విడార్‌ను మన దేశం అధిగమించింది. చైనా నుంచి అన్ని రకాల కాటన్ ఉత్పత్తులను అమెరికా నిషేధం విధించడంతో, ఇండియాతో పాటు, బంగ్లాదేశ్ నుంచి కూడా ఎగుమతులు పెరగుతున్నాయి.
అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ నుంచి కాటన్ టీ షర్టుల కోసం ఆర్డర్లు వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్డర్లు 45 శాతం పెరిగాయి. దుస్తుల ఎగుమతికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వీలుగా పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సానుకూలంగా పరిష్కరించాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.