మల్టిపుల్ నెట్‌వర్క్‌లకు అనుగుణంగా బ్యాంక్‌లు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయాలని ఆర్బీఐ కోరింది. కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డులు జారీ చేసే వారి మధ్య ఉన్న ఏర్పాట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నవాటిని ఎంపిక చేసుకునేందుకు అనుకూలంగా లేవని సమీక్షలో గుర్తించినట్లు తెలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, మాస్టర్ కార్డ్, వీసా, స్వదేశీ రూపే నెట్‌వర్క్‌లు దేశంలో కార్డుల సేవలు అందిస్తున్నాయని పేర్కొంది. అయితే కార్డుల జారీ సాధారణంగా ఆయా బ్యాంక్‌లపై ఆధారపడి ఉందని ఆర్బీఐ తెలిపింది.
కార్డులు జారీ చేసేవారు ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లపై పని చేసేలా జారీ చేయాలని ఆర్బీఐ తన సర్క్యూలర్‌లో కోరింది. మల్టిపుల్ కార్డ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకునేందుకు వీలుగా ఆర్థిక సంస్థలు, బ్యాంక్‌లు అర్హులైన తమ కస్టమర్లకు జారీ చేయాలని కోరింది. ఇలాంటి సదుపాయాన్ని కస్టమర్లు కార్డు జారీ సమయంలోకాని, తరువాత కాని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కార్డుల జారీలో కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిపై బ్యాంక్‌లు, నాన్-బ్యాకింగ్ సంస్థలు, కార్డులు జారీ చేసే సంస్థలు తమ అభిప్రాయాలను ఆగస్టు 4లోగా తెలియచేయాలని ఆర్బీఐ కోరింది.
కార్డ్ జారీ చేసేవారు ఇతర కార్డ్ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించే ఎలాంటి ఏర్పాట్లు, లేదా ఒప్పందాన్ని చేసుకోకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. పోటీ మార్కెట్లో కస్టమర్‌కు ఎంపిక చేసుకునేందుకు పలు అవకాశాలు ఉండాలని ఆర్బీఐ పేర్కొంది