న్యూఢిల్లీ : దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనాల పరంపర కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియెంట్ భయాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనం చేసింది. ఫలితంగా రెండ్రోజులుగా దేశీయ మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. నిన్న ఒక్క రోజే బీఎస్‌ఈ సెన్సెక్స్ 949 పాయింట్లు లేదా 1.65శాతం మేర క్షీణించి 56,747 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 284 పాయింట్లు లేదా 1.65 శాతం మేర నష్టపోయి 16,912 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్బీఐ మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ భేటీ కూడా నిన్ననే మొదలైంది. అయితే ఈ భేటీలో కీలకమైన రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచకపోవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది తొలి మీటింగ్‌లో రివర్స్ రేటును పెంచే అవకాశముందని, ఆ తర్వాతి సమావేశంలో రెపో రేటు పెంపునకు అవకాశం ఉందని విశ్లేషించారు. ఎన్‌ఎస్‌ఈపై 15 రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 3 శాతం మేర నష్టపోయింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ఫార్మా, ప్రైవేటు బ్యాంక్, మెటల్, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు 1 – 1.8 శాతం మధ్య దిగజారాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫలితంగా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు 1.42 శాతం మేర దిగజారింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.1 శాతం మేర క్షీణించింది. నిఫ్టీపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ నష్టదారుగా నిలిచింది. ఈ షేర్లు 3.7 శాతం మేర దిగజారాయి. ఆ తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహింద్రా, టాటా మోటార్స్, విప్రో, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా 2 -3.4 శాతం మధ్య నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీలో యూపీఎల్ మాత్రమే లాభాలతో ముగిసింది. మొత్తంగా బీఎస్‌ఈపై 2002 షేర్లు నష్టాలతో ముగియగా.. 1419 షేర్లు మాత్రమే పాజిటివ్‌గా ముగిశాయి.
స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి..
బ్రాడర్ మార్కెట్లో రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్, స్టార్‌లిట్ పవర్ సిస్టమ్స్, ఎంటీఎన్‌ఎల్‌తోపాటు ప్రధాన షేర్లు లాభదార్లుగా నిలిచాయి. 20 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, మోర్పెన్ ల్యాబ్స్, హిందుస్తాన్ కన్‌స్ట్రక్చన్, ఆల్ఫా ల్యాబ్స్, జేబీఎం ఆటో, కబ్రా ఎక్స్‌ట్రుషన్స్, వింటా ల్యాబ్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, ఐఎఫ్‌సీఐ, బీఈఎంఎల్ అత్యధిక లాభదార్లుగా నిలిచిచాయి. మరోవైపు ప్రకాష్ ఇండస్ట్రీస్, నెక్ట్స్‌డిజిటల్, ఎంఎం ఫోర్జింగ్స్, ఐనాక్స్ విండ్, టార్సన్స్ ప్రొడక్ట్స్, పాలసీ బజార్, గోడ్‌ఫ్రె ఫిలిప్స్, రెలిగారే ఎంటర్‌ప్రైజెస్, సాగర్ సిమెంట్స్, నియోజన్ కెమికల్స్, పీవీఆర్, ఫోర్టీస్ హెల్త్‌కేర్, థర్మెక్స్, ఇగర్షణి మోటార్స్, లెమన్‌ట్రీ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ప్రైమరీ మార్కెట్‌లో ఆనంద్ రాతి వెల్త్ ఐసీవో మూడవ రోజు నాటికి 7.2 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అయ్యింది. రిటైల్ విభాగం నుంచి 7.5 రెట్లు, వెల్తీ ఇన్వెస్టర్ల నుంచి 15.4 రెట్ల సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. కాగా క్యూఐబీ కోటా పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయ్యింది.