ఎలక్ట్రికల్ (ఈవీ) టూ వీలర్స్‌లో పలు లోపాలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గుర్తించింది. ఇటీవల కొన్ని ఈవీల్లో బ్యాటరీలు పేలిన సంఘటనలు జరిగాయి. దీనిపై పరిశీలన జరిపిన డీఆర్డీఓ పలు లోపాలను గుర్తించింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈవీ టూవీలర్స్‌లో ఏమైనా లోపాలు ఉంటే, అలాంటి కంపెనీలపై భారీగా జరిమానాలు విధిస్తామని, చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. లోపాలున్న వాహనాలను కంపెనీలు వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముందుగా లోపాలు గుర్తించిన వాహనాల కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. లోపాలు గుర్తించిన ఓలా, ఒకినోవా, ప్యూర్ ఈవీ కంపెనీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన మోడల్స్‌కు చెందిన ఏడు వేల వాహనాలను ఈ మూడు కంపెనీలు వెనక్కి తీసుకున్నాయని ఆ అధికారి తెలిపారు. ఇలా వెనక్కి పిలిపించిన వాహనాల బ్యాటరీలను క్షుణంగా పరిశీలిస్తున్నామని ఒకినోవా తెలిపింది. రిపేర్లను ఉచితంగా చేసి వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది. వోలా కంపెనీ 1441 వాహనాలను ఇలా వెనక్కి రప్పించింది. ప్యూర్ ఈవీ తన మోడల్స్ ఈట్రాన్స్, ఈప్లూటో 7జీ మోడల్స్‌కు చెందిన 2 వేల వాహనాలను వెనక్కి పిలిపించింది. బ్యాటరీ నిర్ధేశిత స్థాయిదాటి వేడెక్కితే అలారం వచ్చేలా ఒక డివైస్‌ను కెనడా కంపెనీ డెవలప్ చేసిందని , దీన్ని తమ వాహనాల్లోని బ్యాటరీకి అనుసంధానం చేస్తున్నామని హీరో ఎలక్ట్రికల్ కంపెనీ ప్రకటించింది. దీన్ని తేలిగ్గానే బ్యాటరీకి అమర్చవచ్చని తెలిపింది.
జూన్‌లో పెరిగిన ఈవీ టూ వీలర్స్ అమ్మకాలు..
మే నెలతో పోల్చితే ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలుజూన్లో 10 శాతం పెరిగాయి. ఇటీవల వరస ప్రమాదాలతో ఏప్రిల్, మే నెలలో టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. జూన్‌లో తిరిగి వీటి అమ్మకాలు పుంచుకోవడం పట్ల పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌లో అన్ని రకాల 72452 విద్యుత్ వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మే నెలలో ఇవి 65879 గా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2.1 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. విద్యుత్ వాహనాల అమ్మకాల్లో టూ వీలర్స్ అమ్మకాలు 20 శాతం తగ్గాయి. ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో 40 వేల టూ వీలర్స్ అమ్మకాలు తగ్గాయి. జూన్‌లో పరిస్థితి చక్కబడింది. ఈ నెలలో అమ్మకాలు 7 శాతం పెరిగి 42 వేలకు చేరుకున్నాయి. ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలు ప్రతి నెల భారీగా పెరుగుతున్నాయి. త్రీ వీలర్స్ అమ్మకాలు మాత్రం ఆశించిన మేర లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రికల్ టూ వీలర్స్ అమ్మకాల్లో 6981 యూనిట్లతో ఒకినోవా మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. 6541 యూనిట్లతో అంపేర్ రెండో స్థానంలో , 6503 యూనిట్లతో హీరో ఎలక్ట్రికల్ మూడో స్థానంలో ఉన్నాయి. 5883 యూనిట్ల అమ్మకాలతో ఓలా తరువాత స్థానంలో ఉంది. ఏథర్ ఎనర్జీ కంపెనీ టూ వీలర్స్ 3815 యూనిట్ల అమ్మకాలతో చివరి స్థానంలో ఉంది. ఈవీల్లో ఉపయోగిస్తున్న బ్యాటరీలు బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ఉండాలని ఆదేశించడంతో ఇక ముందు వినియోగదారులకు నాణ్యమైన వాహనాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వీటి నాణ్యత, భద్రత పరమైన అంశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.