Tuesday, November 26, 2024

ఈవీ వాహనాల ప్రమాదాలపై నోటీసులు

విద్యుత్‌ వాహనాల్లో ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలపై కేంద్ర వినియోగదారుల సంరక్షణ అధారిటీ (సీసీపీఏ) ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల హక్కుల సంరక్షణ కోసం ఆయా సంస్థలు వెబ్‌సైట్స్‌లో రాయిస్తున్న బోగస్‌ , చెల్లింపుల సమీక్షలపై కూడా త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. విద్యుత్‌ వాహనాల్లో (ఈవీ) ఇటీవల జరిగిన ప్రమాదాలు, బ్యాటరీ పేలుడు వంటి సంఘటనలపై సీసీపీఏ సుమోటోగా ఆయా తయారీ సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు సంస్థ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖేర్‌ వెల్లడించారు. ఈ సంఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా నాలుగైదు కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అనైతిక వ్యాపార విధానాలు అనుసరిస్తున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని నోటీసుల్లో కోరినట్లు చెప్పారు.

ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖలు దీనిపై జోక్యం చేసుకున్నాయని, వినియోగదారుల హక్కుల రక్షించే సంస్థగా తాము కూడా ఇటీవల ఈ ప్రమాదాలపై డీఆర్‌డిఓ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. వెబ్‌సైట్లలో ఫేక్‌ సమీక్షలు, చెల్లింపులతో చేసే సమీక్షలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని ఖేర్‌ చెప్పారు. ప్రధానంగా ఇలాంటి సమీక్షలు గృహోపకరణాలు, డ్రింక్స్‌, ఆహార పదార్ధాలు, ట్రావెల్‌, టూరిజం రంగాల్లో ఎక్కువగా ఉన్నాయని , వీటిని తప్పకుండా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఇప్పటికే ఒక కమిటీని నియమించామని, ఆ కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశమైందని తెలిపారు. ఈ విషయంలో వినియోగదారుల నుంచి కూడా సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు.
ఇలాంటి సమీక్షలతో వినియోగదారులను మోసం చేయడం కుదరదని, దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించారు. హోటల్స్‌లో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయరాదన్న తమ ఆదేశాలపై ఢిల్లిd హై కోర్టు విధించిన స్టేను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ఉత్పత్తుల ప్రమోషన్‌ విషయంలో ఆయా కంపెనీలు తప్పుదారిపట్టించేలా ఉన్న వాటిపై కూడా త్వరలో సీసీపీఏ మార్గదర్శకాలు విడుదల చేయనుంది. వినియోగ ఉత్పత్తుల విషయంలో నాణ్యత విషయంలో దేశ వ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని సీసీపీఏ త్వరలో చేపట్టనుందని తెలిపారు. ప్రధానంగా గ్లిజర్స్‌, వాటర్‌ హీటర్స్‌, గ్యాస్‌ స్టౌవ్‌లు, మైక్రోవోవెన్స్‌, కుట్టుమిషన్లు వంటి ఉత్పత్తులు తప్పనిసరిగా బీఎస్‌ఐ ముంద్ర కలిగి ఉండేలా చూడటంతో పాటు, వాటిని సరిగా పాటిస్తున్నారా లేదా అనేది కూడా చూస్తామని ఆయన వెల్లడించారు. నాణ్యతలేని హెల్మెట్స్‌, కుక్కర్లపై కూడా సీసీపీఏ దృష్టి సారించినట్లు చెప్పారు. రెండు సంవత్సరాలుగా దీనిపై సీసీపీఏ పలు సంస్థలకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఇలా కంపెనీలు, సంస్థలకు నాణ్యత విషయంలో 129 నోటీసులు జారీ చేశారు. తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలనున నిరోధించినట్లు తెలిపారు. 71 నోటీసులు తప్పుదారి పట్టించే యాడ్స్‌ ఇచ్చినందుకు, 49 నోటీసులు అనైతిక వ్యాపార విధానాలు అనుసరిస్తున్నందుకు జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement