హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : లండన్ కు చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోన్ బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. పెరుగుతున్న తమ కస్టమర్ లకు మెరుగ్గా సేవలు అందించడానికి తమ సర్వీస్ సెంటర్ నెట్ వర్క్ ను విస్తరించనున్నట్లు నథింగ్ ప్రకటించింది.
ఈ సందర్భంగా నథింగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ప్రణయ్ రావు మాట్లాడుతూ… హైదరాబాద్, చెన్నైలో కొత్త ప్రత్యేక సేవా కేంద్రాలను ప్రారంభించడం ద్వారా తమ సేవా నెట్వర్క్ను విస్తరించడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు.
భారత మార్కెట్లో తమ వేగవంతమైన వృద్ధితో పాటు అత్యుత్తమ కస్టమర్ సేవ, మద్దతు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామనే దానికి ఇది నిదర్శనమన్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి తమకు ఇప్పటికే ఉన్న ప్రత్యేక సేవా కేంద్రాలతో పాటు ఈ కొత్త కేంద్రాలు తమ కస్టమర్లకు తమ ఉత్పత్తులతో ఉత్తమమైన సంరక్షణ, అనుభవాన్ని అందించడాన్ని నిర్ధారిస్తాయని ఆయన చెప్పారు.