యూపీఐ ద్వారా చేసే డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి, కస్టమర్ల సౌకర్యం కోసం ఎన్పీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ దారులను వివాదాల పరిష్కారానికి ఆన్లైన్ రిజల్యూషన్ వ్యవస్థ ను (ఓడీఆర్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. యూపీఐ వ్యవస్థలో పాల్గొనే సంస్థలు అన్నీ.. సెప్టెంబర్ 30, 2022 నాటికి ఫైయిల్డ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదుల కోసం ఓడీఆర్ వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఏప్రిల్ 11న జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. యూపీఐ చెల్లింపులు పెరుగుతున్న దృష్ట్యా సెప్టెంబర్ 30, 2022 నాటికి యూపీఐ ఇంటర్ఫేస్లో ఇంటర్నేషనల్ మర్చంట్ పేమెంట్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోనున్నట్టు సర్క్యూలర్‌లో ఎన్పీసీఐ తెలిపింది. దీని కారణంగా ఇప్పటి వరకు పేమెంట్స్ సమయంలో డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయి చెల్లింపు పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజాగా రానున్న కొత్త సౌకర్యం కారణంగా ఫిర్యాదులు చేసేందుకు ఓ వేదిక అందుబాటులోకి రానుంది.
2008లోనే ఎన్పీసీఐ ఏర్పాటు..
2008లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్‌లను నిర్వహించడానికి ఒక కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. ఎన్పీసీఐ దేశంలో ఒక బలమైన చెల్లింపు, సెటిల్మెంట్ మౌలిక సదుపాయాలను నిర్మించింది. ఎన్పీసీఐ రూపే కార్డులు, తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీహెచ్ఐఎం), బీహెచ్ఐఎం ఆధార్, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ ఫాస్ట్‌ట్యాగ్) సహా వివిధ చెల్లింపు సంస్కరణలను తీసుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..