Wednesday, November 20, 2024

New SIM card rules | సిమ్ కొనుగోలుపై కొత్త రూల్స్.. జనవరి నుంచి అమల్లోకి..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ఒక వ్యక్తి కొత్త సిమ్‌ కార్డ్‌ తీసుకోవాలంటే దాని కోసం ఒక దరఖాస్తు చేసుకోవాలి. దానికి ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌, ఫొటో ఇవ్వాలి. కాగా కొన్ని కంపెనీలు పేపర్‌ కాకుండా ఆన్‌లైన్‌ విధానంలో అప్లికేషన్‌ ప్రాసెస్‌ను కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా పేపర్‌ ఆధారిత అప్లికేషన్‌ విధానమే నడుస్తోంది. అయితే దేశంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది.

దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా కొత్త సిమ్‌కార్డుల జారీ విషయంలో టెలికాం మంత్రిత్వ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంటూ కొత్త నిబంధనలు ముందుకు తీసుకువస్తోంది. కొత్త సిమ్‌ కార్డు తీసుకునే విధానాన్ని పూర్తిగా ఈ-కేవైసీకి మారుస్తోంది. ఈ కొత్త రూల్స్‌ కొత్త సంవత్సరం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఇకపై 2012 నుంచి అనుసరిస్తున్న పేపర్‌ విధానానికి టెలికాం శాఖ స్వస్తి పలకనుంది.

పెరిగిన వినియోగదారుల సంఖ్య..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొబైల్‌ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. రాష్ట్రంలో ఈ సంఖ్య 8.20 కోట్లకు చేరినట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పార్లమెంటులో అధికారికంగా ప్రకటన చేశారు. మొబైల్‌ సబ్‌ స్కైబర్స్‌ సంఖ్య 6.71 కోట్ల నుంచి 8.20 కోట్లకు, ఇంటర్నెట్‌ సబ్‌స్కైబర్స్‌ సంఖ్య 1.76 కోట్ల నుంచి 6.71 కోట్లకు పెరిగిందని వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం మొబైల్‌ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండగా వీటిలో ఎక్కువ శాతం కొనుగోలు చేసిన సిమ్‌ కార్డులకు దరఖాస్తుల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు పోలీసు, నిఘా సంస్ధలు గుర్తించాయి.

మొబైల్‌ నెట్‌వర్క్‌, సిమ్‌ కార్డు ప్రాముఖ్యంతోనే చాలావరకు అరుదైన, తీవ్రమైన నేరాలను సైతం పోలీసుశాఖ, దర్యాప్తు సంస్ధలు చేధిస్తున్నాయి. అయితే కొన్ని క్లిష్టమైన కేసుల్లో మొబైల్‌, సిమ్‌ కార్డుల ఆధారం అంతా ఇంతా కాదు. కాని అవి నకిలీ అడ్రెస్‌లు, ఇతర దొడ్డి మార్గాల ద్వారా సిమ్‌లు పొందడం వంటి అంశాల కారణంగా దర్యాప్తులో కష్టతరంగా మారుతోంది. దీనికి తోడు అసాంఘిక శక్తులకు నకిలీ ప్రూఫ్‌లతో లభించే సిమ్‌ కార్డులు దేశ సమగ్రతకు, రక్షణకు విఘాతం కలిగిస్తున్నాయి.

విద్రోహ చర్యలకు చెక్‌..

కేంద్రం తీసుకువస్తున్న కొత్త రూల్స్‌తో 2024 జనవరి1వ తేదీ నుంచి కొత్త సిమ్‌ మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే పూర్తిగా డిజిటల్‌ కేవైసీని ఫాలో కావాల్సిందే. దీంతోపాటు పాత నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయి. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి ఎక్కువ సిమ్‌ కార్డులను కొనుగోలు చేయాలంటే కమర్షియల్‌ కనెక్షన్‌ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. కొత్త సిమ్‌ తీసుకునేటప్పుడు కొనుగోలు చేసే వ్యక్తితోపాటు అతనికి విక్రయించే వ్యక్తి కూడా వివరాలు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పలు కంపెనీలు సానుకూలంగా స్పందించడం విశేషం.

కాగా ఇప్పటి వరకు ప్రధానంగా పేపర్‌ విధానాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు వందల సంఖ్యలో సిమ్‌ కార్డులు తీసుకుంటు-న్నారు. వాటిని అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు, దేశ విద్రోహ చర్యలకు ఉపయోగిస్తున్నారు. ఇంతకంటే అత్యంత ప్రమాదకరమై విషయం ఏమంటే ఒక సిమ్‌ కార్డు ఎవరిపేరుమీద అయితే ఉంటుందో ఆ విషయం ఆ వ్యక్తికి అసలు తెలియకపోవడ మే. అంటే ఒక వ్యక్తికి తెలీకుండానే అతని పేరుతో ఉండే సిమ్‌కార్డులను వేరే వ్యక్తి వినియోగించడం ద్వారా అనేక సందర్భాల్లో అమాకులు బలవుతున్నారు.

ఇలా బినామీ, వేరే వ్యక్తుల పేర్లతో ఉండే సిమ్‌ల ద్వారా అసాంఘిక శక్తులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాగే తీవ్రవాద చర్యలకు కూడా ఈ విధంగా సిమ్‌కార్డులు వినియోగించడం ద్వారా అలాంటి సమయాల్లో అమాయకులే పోలీసులు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు కొత్త నిబంధనల మేరకు ఈ-కేవైసీని అనుసరించడం ద్వారా అక్రమార్కులను, అసాంఘిక శక్తులకు చెక్‌ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల విచ్చలవిడిగా సిమ్‌ కార్డులు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడేవారికి చెక్‌ పెట్టవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement