Tuesday, November 19, 2024

రేపటి నుంచి కొత్తరూల్స్.! క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌కు ఓటీపీ.. డిమ్యాట్‌ ఖాతాకు అథెంటికేషన్‌..

ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. వినియోగ దారులకు మెరుగైన సేవలు, భద్రత ప్రమాణాలు అందించే క్రమంలో ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లోని కంపెనీలు కొత్తకొత్త మార్పులను చేపడుతుంటాయి. అందుచేత ఈ మార్పులపై వినియోగదారులు సదా అవగాహనతో ఉండాలి. ప్రస్తుతకాలంలో క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు వినియోగం సర్వసాధారణం అయింది. అలాగే స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడులకు డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి అయింది. వీటికి సంబంధిచిన రూల్స్‌లో అక్టోబర్‌ 1నుంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం..

డీమ్యాట్‌ ఖాతాకు అథెంటికేషన్‌..

డీమ్యాట్‌ ఖాతాదారులు సెప్టెంబర్‌ 30లోపు తమ ఖాతాకు టు ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో ఎన్‌ఎస్‌ఈ ఇందుకు సంబంధించి సర్క్యులర్‌ విడుదల చేసింది. డీ మ్యాట్‌ ఖాతా వినియోగదారులు ప్రస్తుతం యూజర్‌ ఐడీతోపాటు పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ ఉపయోగిస్తున్నారు. ఇకపై దీనికి అదనంగా బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కూడా చేసుకోవాలని జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచించింది.

క్రెడిట్‌కార్డు యాక్టివేషన్‌కు ఓటీపీ

- Advertisement -

క్రెడిట్‌కార్డు యాక్టివేషన్‌కు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. రేపటి నుంచి ఈ రూల్స్‌ అమల్లోకి వస్తున్నాయి. ఒకటవ తేదీ నుంచి క్రెడిట్‌కార్డు జారీ సంస్థలు, కార్డు జారీ చేయడానికి ముందు కార్డు దారుడి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. కార్డు జారీచేసిన 30 రోజుల్లోగా అనుమతి పొందకుంటే ఆ తర్వాత వారం రోజుల్లో సదరు కార్డును బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే, వినియోగదారుల అనుమతి లేకుండా కార్డు నగదు వినిమయ పరిమితిని పెంచవద్దని రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తేల్చిచెప్పింది.

జీఎస్‌టీ రిటర్నులు..

వస్తు–సేవల పన్ను (జిఎస్‌టి)కి సంబంధించిన కీలక మార్పులు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ల దాఖలుకు అదనపు సమయం ఇవ్వడం, పన్ను సమ్మతిని మరింత బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందేందుకు గడువును నవంబర్‌ వరకు పొడిగించారు. అలాగే, క్రెడిట్‌ నోట్స్‌ జారీ, రిటర్న్స్‌లో డిక్లరేషన్‌ గడువు తేదీని సెప్టెంబర్‌ 30 నుండి నవంబర్‌ 30 వరకు పొడిగించారు. ఇన్‌వాయిస్‌కు సంబంధించిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను మాత్రమే పొందవచ్చని తాజా నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. అలాగే సంబంధిత వ్యక్తి వరుసగా ఆరు నెలలు రిటర్నలు దాఖలు చేయనిపక్షంలో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దవుతుంది.

ఐటీ చెల్లించేవారికి ఏపీవైలో నో చాన్స్‌

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో చేరేందుకు ఆదాయపుపన్ను చెల్లింపుదారులను కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ కంటే ముందే ఈ పథకంలో చేరిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఇకపై ఈ స్కీమ్‌లో కొనసాగుతారు.ఒకవేళ పన్ను చెల్లింపుదారులెవరైనా అక్టోబర్‌ 1 తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేయడం జరుగుతుందని ఆర్థికమంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ పేర్కొంది.

టోకనైజేషన్‌ అమలు..

డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపు కోసం ఆర్‌బీఐ కొత్త రూల్‌ తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ విధానాన్ని అమలు చేయాలని సంబంధిత సంస్థలను ఆర్‌బీఐ కోరింది. తొలుత 2021 జూన్‌ 30వ తేదీ వరకు గడువు నిర్దేశించగా, పేమెంట్‌ ఆపరేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత వ్యక్తం చేయనందున పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పటి వరకు నిర్దేశించిన గడువు నేటితో ముగియనుంది. రేపటి నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. టోకనైజేషన్‌ చేయడం ద్వారా కార్డు వివరాలు వ్యాపారసంస్థల వద్ద స్టోర్‌ కావు. దీనివల్ల సున్నిత సమచారం సైబర్‌ నేరగాళ్లకు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎన్‌పీఎస్‌లో మార్పు..

జాతీయ పింఛన్‌ పథకం (ఎన్‌పిఎస్‌) ఈ -నామినేషన్‌కు సంబంధించి అక్టోబర్‌ 1నుంచి కీలక మార్పు రాబోతున్నది. సబ్‌స్క్రైబర్లు ఈ-నామినేషన్‌ చేపట్టినప్పుడు నోడల్‌ ఆఫీసర్‌ దాన్ని ఆమోదించొచ్చు. లేదంటే ఏవైనా అభ్యంతరాలుంటే తిరస్కరించొచ్చు. అయితే, ఒకవేళ 30 రోజుల్లోగా సంబంధిత నోడల్‌ అధికారి ఎలాంటి నిర్యణం తీసుకోనిపక్షంలో సీఆర్‌ఏ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఈ-నామినేషన్‌ ఆమోదం పొందుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement