ఈఎస్ఐ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని ఈ సంస్థ నిర్ణయించింది. 2022 చివరి నాటికి దేశంలోని మొత్తం 744 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించింది. హైదరాబాద్లో జరిగిన ఈఎస్ఐసీ 188వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని సంస్థ తెలిపింది. ఈఎస్ఐలో సభ్యత్వం ఉన్న కార్మికులు, ఉద్యోగులు ఎలాంటి ఖర్చు లేకుండానే ఔట్ పేషంట్, ఇన్ పేషంట్ సేవలు, చికిత్సలు, ఆపరేషన్లు వంటివి ఉచితంగా పొందవచ్చు. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అందుబాటులోని సేవలను గుర్తింపు పొందిన కార్పోరేట్ ఆసుపత్రుల్లో పొందవచ్చు.
ప్రస్తుతం ఈఎస్ఐ పథకం దేశంలోని 443 జిల్లాల్లో పూర్తిగా, 153 జిల్లాల్లో పాక్షికంగా అమల్లో ఉంది. ఇంకా 148 జిల్లాలు దీని పరిధిలో లేవు. 1952లో మొదటిసారి 25 వేల మంది ఉద్యోగులు, కార్మికులతో ఢిల్లి, కాన్పూర్లో ప్రారంభించారు. 2021 మార్చి 31 నాటికి ఈఎస్ఐసీలో బీమా పొందిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు కలిసి 13.1 కోట్ల మంది ఉన్నారు. ఈఎస్ఐ కి ప్రస్తుతం దేశంలో 154 ఆసుపత్రులు, 1570 డిస్పెన్సరీలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.