నోట్ల రద్దు చేసి ఆరు సంవత్సరాల తరువాత కూడా నగదు చలామణి ఏ మాత్రం తగ్గలేదు. పైగా భారీగా పెరిగింది. 2022, అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 30.88 లక్షల కోట్లకు చేరింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన 2016, నవంబర్ 4తో పోల్చితే ప్రజల వద్ద ఉన్న నగదు నిలువ 71.84 శాతం పెరిగినట్లు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్
చెల్లింపులను ప్రోత్సహించడం, నకిలీ కరెన్సీని అరిక్టడం, నల్ల ధానాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016, నవంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన సమయానికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 17.7 లక్షల కోట్లు. అక్టోబర్ 21 నాటికి అది 30.88 లక్షల కోట్లకు చేరింది. సాధారణ లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, వస్తువులు- సేవల కొనుగోళ్లకు ఉపయోగించే డబ్బును ప్రజల వద్ద నగదు కింద జమ కడతారు. వ్యవస్థలో మొత్తం చలామణిలో ఉన్న నగదు నుంచి బ్యాంక్‌ల వద్ద ఉన్న డబ్బును తీసివేస్తే ఇది వస్తుంది. అనేక డిజిటల్ చెల్లింపుల సాధనాలు అందుబాటులోకి వస్తున్నటికీ, నగదు చలామణి కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
దీపావళి వారంలో నగదు చలామణి 7,600 కోట్ల మేర తగ్గిందని ఇటీవల ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఇలా నగదు చలామణి తగ్గడం రెండు దశాబ్దాల్లో తగ్గడం ఇదే మొదటిసారని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, నగదు చలామణి కూడా పెరుగుతున్నదని ఆర్బీఐ తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందడం వల్లే ఇలా నగదు చలామణి కూడా పెరుగుతున్నదని పేర్కొంది. జీడీపీ రేషియోతో పోల్చితే మన దేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపులు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది.