Friday, November 22, 2024

కొత్త టెలికం బిల్లుకు తొందరలేదన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్‌..

కొత్త టెలికమ్యూనికేషన్ల చట్టాన్ని తీసుకు వచ్చేందుకు తొందరేమీలేదని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇందుకు ఆరు నుంచి 10 నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. వివిధ వర్గాలతో జరుపుతున్న సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తరువాత ఫైనల్‌ డ్రాఫ్ట్‌ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ డ్రాఫ్ట్‌ను ముందు పార్లమెంట్‌ కమిటీకి పంపిస్తామని చెప్పారు. దీని తరువాత ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనికి సమయం పడుతుందన్నారు. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలీగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ యాక్ట్‌ 1950 స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లును తీసుకు వచ్చింది . దీనిపై అక్టోబర్‌ 20 లోపు అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం కోరింది.

ఇంటర్నెట్‌ ద్వారా ఆడియో, వీడియో కాలింగ్‌, మెసేజింగ్‌ సేవలు అందిస్తున్న వాట్సప్‌, జూప్‌, గూగుల్‌ డుయో వంటి ఓవర్‌ ది టాప్‌ సంస్థలు కూడా ఇక నుంచి దేశీయ టెలికం లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. టెలికం, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుమలన్ని మాఫీ ఏసే నిబంధనను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఒక వేళ సదరు సంస్థలు లైసెన్స్‌లను సరెండర్‌ చేస్తే రుసుములను వెనక్కి ఇచ్చే ప్రతిపాదనను ఇందులో చేర్చారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement