Sunday, November 24, 2024

గూగుల్ పై మైక్రోసాఫ్ట్‌ ఈసీఓ ఆగ్రహం.. ప్రత్యర్ధుల ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శ

సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని మైక్రోసాఫ్ట్‌ ఈసీఓ సత్య నాదెళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌ అనుసరిస్తున్న విధానాల మూలంగా ప్రత్యర్ధి సంస్థలు ఎదగడం కష్టంగా మారిందన్నారు. గూగుల్‌ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికాలో ఒక కోర్టులో మాట్లాడుతూ ఆయన గూగుల్‌ విధానాలను తప్పు పట్టారు.

అమెరికా ప్రభుత్వం, గూగుల్‌ మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్‌ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం యాపిల్‌ వంటి సంస్థలకు బిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు అమెరికా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించారు. ఈ కేసులోనే సత్య నాదెళ్ల కూడా తమ వాదనలు కోర్టు ముందుంచారు.

గూగుల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ అనే సెర్చింజన్‌ను తీసుకు వచ్చింది. 2009 నుంచి మార్కెట్‌ వాటాను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే యాపిల్‌, గూగుల్‌ చేసుకున్న ఒప్పందం వల్ల తమ బింగ్‌ పోటీ పడలేకపోతోందని నాదెళ్ల అన్నారు. గూగుల్‌ దీన్ని ఆదరణగా చెబుతున్నప్పటికీ, తాము దీన్ని ఆధిపత్యంగానే భావిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచంలోని తొలి ప్రముఖ సెర్చ్ ఇంజన్‌గా గూగుల్‌ భారీ ఎత్తున డేటా సేకరించిందని అమెరికా ప్రభుత్వం వాదించింది. అలాగే తొలి కంపెనీగా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించిందని తెలిపింది. ఇదే కంపెనీకి వాణిజ్య ప్రకటనలు, వినియోగదారులను అందించే శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ వాదనకు సత్య నాదెళ్ల మద్ధతు తెలిపారు. కనీస మార్కెట్‌ వాటా లేకుండా గూగుల్‌ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం సులభం కాదని చెప్పారు.

డిఫాల్ట్‌పైనే ఆధారపడి ఉంది…

- Advertisement -

ఒక సెర్చింజన్‌ విజయం దాని పంపిణీ పైనే ఆధారపడి ఉంటుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఈ నేపథ్యంలోనే యాపిల్‌ కంపెనీకి భారీ ఎత్తున చెల్లించడానికి తాము సిద్ధమైనట్లు చెప్పారు. సెర్చింజన్‌ డిఫాల్ట్‌గా ఇవ్వడంపైనే అంతా ఆధారపడి ఉంటుందన్నారు. యాజర్లు సులువుగా తమకు నచ్చిన యాప్‌నకు బదిలీ అవుతారని గూగుల్‌ చేస్తున్న వాదనలో నిజంలేదని పేర్కొన్నారు. సఫారీ బ్రౌజర్‌లో డిఫాల్ట్‌గా ఉంటే బింగ్‌ రూపురేఖలే మారిపోతాయని తెలిపారు.

గూగుల్‌తో జట్టుకట్టిన యాపిల్‌ ఏటా బిలియన్‌డ డాలర్ల ఆదాయాన్ని పొందుతుందన్నారు. ఈ కారణంగానే బింగ్‌ వెనుకబడిందని చెప్పారు. వ్యాపార నమూనా పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవడమో, లేక భారీ మార్పు వస్తుందనే ఆశతో బింగ్‌పై భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు సత్య నాదెళ్ల తెలిపారు. ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీపై తొలిరోజుల్లో కొంత ఆసక్తి కనిపించినప్పటికీ, గూగుల్‌ ఆధిపత్యాన్ని మార్చడంలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బింగ్‌కు కూడా ఏఐ సాంకేతికతను జోడిస్తూ మైక్రోసాఫ్ట్‌ కొన్ని మార్పులు చేసింది. ఇది గూగుల్‌ గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తుందని ఆశించింది. కాని గూగుల్‌ కూడా ఈ దిశగా ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీంతో భవిష్యత్‌లో చివరకు ఏఐలోనూ ఇరు కంపెనీల మధ్య ఒక విష వలయం ఏర్పడే అవకాశం ఉందని సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement