Tuesday, November 26, 2024

త్వరగా గ్రీన్‌ కార్డు జారీకి చర్యలు.. సమయం 6 నెలలకు తగ్గింపు

గ్రీన్‌ కార్డుల జారీ ప్రాసెసింగ్‌, తుది నిర్ణయం తీసుకునేందుకు పడుతున్న సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా నిర్ణయించింది. దీనిపై ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఇచ్చిన రికమండేషన్స్‌ను అమలు చేయనున్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌ కార్డుల ప్రాసెసింగ్‌, జారీ వ్యవధి 6 నెలలకు తగ్గనుంది. 2023 ఏప్రిల్‌ నాటికి ఇందుకు ఉన్న అన్ని అడ్డంకులను అధికమించాలని నిర్ణయించారు. దీని వల్ల గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా ఇండియా, చైనా దేశాలకు చెందిన వేలాది కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ప్రెసిడెంట్‌ అడ్వైజరీ కమిషన్‌ ఈ సంవత్సరం మే నెలలో దీనిపై రికమండేషన్స్‌ను సమర్పించింది. వీటిని మే 12న ఆమోదించిన కమిటీ అధ్యక్షుడి పరిశీలనకు ఆగస్టు 24న పంపించింది.

దీన్ని వైట్‌హౌస్‌లో డొమెస్టిక్‌ పాలసీ కౌన్సిల్‌ ఈ రికమండేషన్స్‌ను సమీక్షిస్తోంది. దీని తరువాత అధ్యక్షుడి ఆమోదం కోసం పంపిస్తారు. గ్రీన్‌ కార్డు అనేది అమెరికాలో పర్మినెంట్‌ నివాసం కోసం ఉద్దేశించింది. అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకునే వారు గ్రీన్‌ కార్డు కోసం అప్లయ్‌ చేసుకుంటారు. ఇది వస్తే ఇక అమెరికా పౌరుడిగా ఇక్కడే పర్మినెంట్‌ రెసిడెంట్‌గా మారుతారు. అధ్యక్షుడు ఈ రికమండేషన్స్‌ను అంగీకరించి ఆమోదిస్తే వేలాది మంది ఇండియన్లకు ప్రయోజనం కలుగుందని భావిస్తున్నారు. కొవిడ్‌ ఆంక్షలు, అంతకు ముందు 2017లో కొన్ని దేశాలపై విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ మూలంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గ్రీన్‌ కార్డ్‌ల కోటా మేరకు కూడా జారీ చేయడంలేదు.

2021లో 2,26,000 గ్రీన్‌ కార్డులు జారీకి అందుబాటులో ఉంటే కేవలం 65,452 మాత్రమే జారీ చేశారు. ప్రస్తుతం అమెరికా వీసా అధికారులు అదనపు సిబ్బందిని నియమించి పెండింగ్‌ వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. గ్రీన్‌ కార్డుల జారీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 ఏప్రిల్‌ కల్లా అన్ని బ్యాక్‌లాగ్‌ వీసాలు, గ్రీన్‌ కార్డుల జారీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement