Tuesday, November 26, 2024

విల్మర్‌ చేతికి కోహినూర్‌.. వ్యాపార విస్తరణపై దృష్టి

న్యూఢిల్లి : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌.. సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌ జాయింట్‌ వెంచరే.. ఈ అదానీ విల్మర్‌. తన వ్యాపార విస్తరణలో దూసుకువెళ్తున్నది. వంట సరుకుల విక్రయాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నది. ఎఫ్‌ఎంసీజీ విభాగాల్లో విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నది. తాజాగా మెక్‌కార్మిక్‌ స్విట్జర్లాండ్‌కు చెందిన కోహినూర్‌ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆహార పదార్థాల వ్యాపారంలో పట్టును పెంచుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. కోహినూర్‌ పేరిట విక్రయిస్తున్న బాస్మతీ బియ్యం, రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ కూరలు, మీల్స్‌ పోర్ట్‌ఫోలియోపై అదానీ విల్మర్‌కు విక్రయ హక్కులు దక్కనున్నాయి. కోహినూర్‌ ద్వారా ఎఫ్‌ఎంసీజీలో ప్రీమియం వినియోగదారులను కూడా ఆకట్టుకునేందుకు అవకాశం లభిస్తుందని అదానీ విల్మర్‌ ప్రతినిధులు తెలిపారు. కోహినూర్‌ బ్రాండ్‌ కింద.. కోహినూర్‌-ప్రీమియం బాస్మతీ రైస్‌, చార్మినార్‌-ఆఫర్టబుల్‌ రైస్‌, హొరేకా-హోటల్‌, రెస్టారెంట్‌, కేఫ్‌ సెగ్మెంట్లు ఉన్నాయి. అదానీ విల్మర్‌ ఐపీఓలో 12 శాతం వాటాల విక్రయం తరువాత.. ఇద్దరు ప్రమోటర్లకు 88 శాతం వాటాలు ఉన్నాయి.

దూసుకెళ్తున్న విల్మర్‌ షేర్లు..

అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లు ఇటీవల భారీగా దూసుకెళ్తున్నాయి. ఫిబ్రవరి 8న నమోదైంది. ఇష్యూ ధర రూ.230తో పోలిస్తే.. కంపెనీ షేర్లు ఇప్పటి వరకు 231.98 శాతం పెరిగాయి. ఒక్కో షేరుపై రూ.526 లాభం వచ్చింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో రూ.753.60 వద్ద స్థిరపడింది. అయితే సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం నిరాశపర్చింది. 26 శాతం కుంగి.. రూ.234.29 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి లాభం రూ.315 కోట్లుగా ఉండింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.803.73 కోట్లు కాగా.. మొత్తం ఆదాయం రూ.54,385.89 కోట్లుగా నమోదైంది. కోహినూర్‌ను సొంతం చేసుకున్న డీల్‌ విలువ ఎంత అనేది మాత్రం ఇరు కంపెనీలు వెల్లడించలేవు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement