Saturday, November 23, 2024

పెర‌గ‌నున్న మారుతీ సుజుకీ, ఆడీ, టాటా కార్ల‌ ధ‌ర‌లు

దేశీయంగా కార్ల ధరలు పెరగనున్నాయి. దేశంలో అతి పెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ, జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. వచ్చే సంవత్సరం జనవరి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఈ కంపెనీలు తెలిపాయి. ద్రవ్యోల్బణం, ముడి సరకుల ధరలు పెరగడంతో కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.

ఎంత శాతం పెంచుతున్నదీ మారుతీ వెల్లడించలేదు. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని తెలిపింది. మారుతీ సుజుకీ 3.54 లక్షల రూపాయల ధరలో ఆల్టో నుంచి 28.42 లక్షల విలువైన ఇన్‌విక్టో వరకు వివిధ మోడళ్ల కార్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. కంపెనీ సాధ్యమైనంత వరకు పెరుగుదల భారాన్ని భరించాలని భావించిందని, చాలా స్వల్ప స్థాయిలోనే వినియోగదారులపై వేయక తప్పడంలేదని తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1న మారుతీ సుజుకీ కార్ల ధరలను 0.8 శాతం పెంచింది.

- Advertisement -

2 శాతం పెంచిన ఆడీ…

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ అన్ని కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు 2024 జనవరి1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఇన్‌పుట్‌ కాస్ట్‌, ని ర్వహణ వ్యయాలు పెరగడంతో కార్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. సంస్థతో పాటు, తమ డీలర్ల మనుగడ కోసం పెంపు తప్పలేదని ఆడీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. సప్లయ్‌ చైన్‌ వ్యయం పెరగడం కూడా ఇందుకు కారణమని తెలిపారు. పెంపు ప్రభావం సాధ్యమైనంత వరకు కస్టమర్లపై పడకుండా ఉండేలా చూస్తామని చెప్పారు. ఆడీ భారత్‌లో క్యూ3 నుంచి ఆర్‌ఎస్‌క్యూ 8 వరకు పలు మోడల్‌ కార్లను విక్రయిస్తోంది. ఆడీ కార్లు 42.77 లక్షల నుంచి 2.22 కోట్ల రూపాయల ధరల్లో లభిస్తున్నాయి.

అక్టోబర్‌లో మారుతీ సుజుకీ అత్యధికంగా 1,99,217 యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ విక్రయించిన 1,67,520 యూనిట్లతో పోల్చితే ఇది 19 శాతం ఎక్కువ. కంపెనీ అక్టోబర్‌ నెలలో అత్యధికంగా1,77,266 యూనిట్లను డిస్పాచ్‌ చేసింది. ఆడీ ఇండియా ఈ సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో అమ్మకాలు 88 శాతం పెరిగి 5,530 యూనిట్లుగా నమోదయ్యాయి.

పెరగనున్న టాటా కార్ల ధరలు…

2024 జనవరి నుంచి టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ కార్ల ధరలను పెంచనుంది. విద్యుత్‌ కార్ల ధరలు కూడా పెంచనున్నట్లు తెలిపింది. ఎంత మేర పెంచుతున్నది, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. టాటా మోటార్స్‌ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరలు పెంచింది. ప్రస్తుతం టాటా మోటార్స్‌ నుంచే ఎక్కువ విద్యుత్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో టాటా హరియర్‌ వెరియంట్‌లో కూడా విద్యుత్‌ కారు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement