Tuesday, November 12, 2024

నష్టాల బాటలో మార్కెట్లు.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. రెండో రోజూ సూచీల నేలచూపు

చమురు ధరలు పెరగడం, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు వార్తలతో ఇన్వెస్టర్లు ఆచితూచి మార్కెట్లలో అడుగులు వేస్తున్నారు. దీంతో పాటు చైనా ఆర్థిక కేంద్రమైన షాంఘైలో లాక్‌డౌన్‌ విధింపు ఉంటుందన్న వార్తలు దేశీయ మార్కెట్‌ సూచీలను దెబ్బతీశాయి. వరుసగా రెండో రోజైన బుధవారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే ట్రేడ్‌ అయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 59,815.71 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,509.84 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 566.09 (0.94 శాతం) పాయింట్ల నష్టంతో.. 59,610.41 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే.. 17,842.75 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. చివరికి 149.75 (0.83 శాతం) పాయింట్లు నష్టపోయి 17,807.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 17,779.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.75.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నది. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 100 ఇండెక్స్‌ 0.59 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.12 శాతం క్షీణించడంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 2,198 కంపెనీల షేర్లు లాభాలు పొందగా.. 1196 కంపెనీల షేర్లు నష్టపోయాయి.

11 శాతం నష్టపోయిన హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌..

విలీన వార్తల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేర్లు సోమవారం భారీ లాభాలను పొందాయి. ఆ తరువాతి నుంచి రెండు సెషన్స్‌లో ఈ స్టాక్స్‌ భారీగా క్షీణించాయి. సెన్సెక్స్‌ 30 షేర్స్‌లో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్డిdఎఫ్‌సీ జంట షేర్లు, హెచ్‌సీఎల్‌టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఎఅండ్‌ఎం షేర్లు నష్టాలు చవిచూశాయి. సోమవారం నాటి గరిష్టాల నుంచి హెచ్‌డీఎఫ్‌సీ టిన్‌ షేర్లు.. 11 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటిష్‌ ఇంధన దిగ్గజం బీపీల సంయుక్త సంస్థ జియో-బీపీ, టీవీఎస్‌ మోటార్‌లు కలిసి దిచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో టీవీఎస్‌ మోటార్‌ షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య విధించిన తాజా ఆంక్షలు దేశీయ సూచీలను దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలను కూడా ఇన్వెస్టర్లు గమనిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ప్రారంభం అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement