ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే ఆర్బీఐ ముందున్న ప్రథమ కర్తవ్యమని గమర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. ఈ క్రమంలో వృద్ధిపై ఉండే ప్రతి కూల ప్రభావాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వృద్ధిరేటు తగ్గుతోందని, దాని ప్రభావం మన దేశంపై కూడా ఉందన్నారు. ధరల పెరుగుదల, ప్రపంచ పరిణామాలు వృద్ధిపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మన వృద్ధిరేటు 13.5 శాతంగా నమోదైంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 20.1 శాతంగా ఉంది. త్రైమాసికం వారిగా చూస్తే 4.1 శాతం పెరిగింది. జూన్ త్రైమాసికంలో వృద్ధిరేటు 16.5 శాతం నమోదయ్యే అవకాశం ఉందిన ఆర్బీఐ అంచనా వేసింది. అంచనాలు తప్పడంతో దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. వచ్చే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో దీనిపై వివరణ ఇస్తామని ఆయన చెప్పారు.
బ్యాంక్‌ల రుణ వృద్ధిరేటును ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని, ఎక్కడైనా పరిధి దాటినట్లు భావిస్తే బ్యాంక్‌లను హెచ్చరిస్తామన్నారు. మన దేశం వద్ద పెద్ద ఎత్తున విదేశీ మారక నిల్వలు ఉన్నాయని శక్తికాంతదాస్ తెలిపారు. ఇవి మన ఆర్ధిక వ్యవస్థకు పెద్ద అండ అని చెప్పారు. ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే మన రూపాయి ఇంకా స్థిరంగానే ఉందన్నారు.
ఆర్బీఐ పెంచిన వడ్డీరేట్లు ఇంకా పూర్తిగా రుణ రేట్లకు బదిలీ కాలేదన్నారు. రుణ, డిపాజిట్ల రేట్ల మధ్య తేడా క్రమంగా తగ్గుతుందన్నారు. గత నెల ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి వడ్డీరేట్లు చేర్చింది. మన దేశ బ్యాంక్‌ల వద్ద సరిపడ మూలధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. రుణ వృద్ధి కొనసాగించాలంటే బ్యాంక్‌లు మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30న ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయం కమిటీ సమావేశం జరుగుతుంది. ఆర్బీఐ ఇప్పటి వరకు మూడు దఫాలుగా 140 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచింది. ద్రవ్యోల్భణం కట్టడికి మరోసారి ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.