రుణాలు తీసుకున్నవారికి ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా గత ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు రుణాలపై మారటోరియం విధించారు. ఆగస్టు నుంచి మారటోరియం ఎత్తివేయడంతో రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. అయితే.. మారటోరియం కాలంలో రుణాలు తీసుకున్న వారి నుంచి పలు సంస్థలు వడ్డీకి వడ్డీని వసూలు చేస్తున్నాయి. దీనిపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘమైన విచారణ జరిగింది. దీనిపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఒకవేళ బ్యాంకులు ఇప్పటికే వడ్డీపై వడ్డీ వసూలు చేసినట్లయితేవడ్డీపై వడ్డీని వసూలు చేయకూడదని సుప్రీం తీర్పు ఆ మొత్తాన్ని కస్టమర్ అకౌంట్లోకి అడ్జస్ట్ చేయాలని ఆదేశించింది. అయితే మొత్తం వడ్డీ మినహాయించడం సాధ్యం కాదని చెప్పింది. అలా చేస్తే డిపాజిటర్లు నష్టపోతారని అభిప్రాయపడింది. బ్యాంకులు అకౌంట్ హోల్డర్లకు, పెన్షనర్లకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి రుణగ్రహీతలకు పూర్తిగా వడ్డీ మినహాయించడం సాధ్యం కాదని తెలిపింది.
అటు మరోవైపు ఆర్థిక విధాన వ్యవహారాల విషయంలో న్యాయస్థానాలు సలహాదారులుగా వ్యవహరించలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా ఊరట అందించే నిర్ణయాలను కోర్టులు నిర్ణయించలేవని తెలిపింది. దీంతో మారటోరియంపై కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్ధిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని ఆదేశించలేమని కోర్టు తెలిపింది. మారటోరియం కాలం పొడిగించాలని చెప్పేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.