హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలీసుల నిఘా, నియంత్రణతో కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న లోన్ యాప్ సంస్థలు మళ్లిd విజృంభిస్తున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని అందినంత దండుకునేందుకు వేర్వేరు మార్గాలలో ప్రయత్నిస్తున్న సంస్థలు ఉచ్చులోపడిన వారి రక్తమాంసాలను తింటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రుణ యాప్ సంస్థలు ఈ సారి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని తమ దోపిడీకి తెరతీశాయి. చదువుకునే విద్యార్థులను టార్గెట్ చేసి వారికి లోన్లు ఇచ్చి అధిక వడ్డీలు గుంజుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు క్రెడిట్ కార్డులంటూ హ్యాండ్ లోన్ పేర్లతో డబ్బులను పంపించి లోబరచుకుంటున్నాయి. ఇక్కడి నుంచే ఆ సంస్థలు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. రుణం తీసుకొని కట్టలేని విద్యార్థులకు బతికి ఉన్నప్పుడే నరకాన్ని చూపిస్తున్నాయి. ఇచ్చిన రుణానికి నాలుగింతల డబ్బులు చెల్లించినప్పటికీ మరింత డబ్బు బాకీ ఉన్నారంటూ టార్చర్ పెడుతున్నాయి. విసిగిపోయిన విద్యార్థులు ఏదైతే అది అవుతుందన్న అభిప్రాయంతో ఉంటే వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసిన నిర్వాహకులు నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. లోన్లు ఇచ్చేటపుడు పేరెంట్స్ పర్మిషన్ తీసుకోకుండానే డబ్బులను పంపించిన ఆయా సంస్థలు. వాటిని తిరిగి చెల్లించినప్పటికీ ఇంకా బాకీ ఉన్నారంటూ పేరెంట్స్‌ను నానా మాటలు అంటున్నారు. బెంగళూరుకు చెందిన స్లైస్ యాప్ సంస్థ ఇటువంటి ఆగడాలకు పాల్పడుతున్నట్లు సీసీఎస్ పోలీసులకు గడచిన వారం రోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్లెస్త్ యాప్ ఆగడాలపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.
కళాశాల విద్యార్థులు, ప్రైవేట్ సంస్థలలో పని చేసే వారు, పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ చదువుకునే వారిని ఈ సంస్థ టార్గెట్ చేస్తోందని, వేర్వేరు కళాశాలల్లో పని చేస్తున్న డబ్బు అవసరం ఉన్న విద్యార్థులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్న సంస్థ అడిగినంత మొత్తాలను ఎలాంటి ష్యూరిటీలు లేకుండానే ఇస్తోందని పోలీసులు చెబుతున్నారు. తర్వాత రుణ యాప్ సంస్థలు తమ విశ్వరూపాన్ని చూపిస్తూ విద్యార్థులను, తలిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని పోలీసులు తెలిపారు. రుణ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ అమాయకులు వాటి బారిన పడుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. కాలేజీల్లో చదివే విద్యార్థులు రుణ యాప్‌ల బారిన పడకుండా తలిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..