ప్రముఖ సంస్థ ఎల్‌ఎంఎల్ 2023 నాటికి మార్కెట్‌లో తొలి విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్‌లో విడుదల చేయనుంది. కంపెనీ విస్తరణ కోసం 500 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ ఎండీ,సీఈఓ యోగేష్ భాటియా తెలిపారు. ఈ నిధులతో సొంత తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ వాహనాల ఉత్పత్తి కోసం సయేరా ఎలక్ట్రిక్‌తో ఎల్‌ఎంఎల్ ఎలక్ట్రిక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెరికా కంపెనీ హార్లీ డేవిడ్‌సన్‌కు చెందిన హరియాణాలోని బవల్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడి నుంచి ఎల్‌ఎంఎల్ తన మొదటి విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేయనుంది.
ఎల్‌ఎంఎల్ మొత్తం మూడు వాహనాలను విడుదల చేస్తుందని యోగేష్ భాటియా వెల్లడించారు. మొదటిది ఎలక్ట్రిక్ బైక్‌ను 2023 ద్వితీయార్ధంలో మార్కెట్‌లోకి విడుదల చేస్తామన్నారు. రెండోది విద్యుత్ స్కూటర్, మోటార్‌సైకిల్ సమ్మేళనమైన హైపర్ బైక్‌ను విడుదల చేస్తామన్నారు. మూడోది ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఆయన వివరించారు. గత సంవత్సరం ఎల్‌ఎంఎల్ బ్రాండ్‌ను, దాని మేథోపరమైన హక్కులను సింఘానియా కుటుంబం నుంచి యోగేష్ భాటియాకు చెందిన ఎస్‌జీ కార్పొరేట్ మొబిలిటీ సొంతం చేసుకుంది. బ్రాండ్ కొనుగోలు, వాహన అభివృద్ధి, తొలిదశ తయారీ వంటి కార్యకలాపాలకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మన దేశంతో పాటు విదేశాల్లోనూ వ్యాపార విస్తరణ కోసం 500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు చెప్పారు. ఈ నిధుల సమీకరణ తరువాత సయేరాతో భాగస్వామ్య ఒప్పందం ఉన్నప్పటికీ, సొంతంగానే తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
రెండు సంవత్సరాల్లో స్వంత తయారీ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, 2025 నాటికి సంవత్సరానికి 10 లక్షల వాహనాల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే 4 నుంచి 5 సంవత్సరాల్లో దేశంలోని అన్ని జిల్లాల్లో తమ డీలర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్‌ఎంఎల్ 1990లో మంచి ఆదరన ఉన్న ద్విచక్ర వాహన కంపెనీ, కాన్పూర్ కేంద్రంగా స్కూటర్లు, మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేసింది. క్రమంగా ఆర్ధిక ఇబ్బందులతో కంపెనీ 2018లో మూతపడింది. ఇప్పడు ఇదే బ్రాండ్‌పై భాటియా నేతృత్వంలోని ఎస్‌జీ కార్పొరేట్ మొబిలిటీ కింద మార్కెట్‌లోకి రానుంది.