దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌కు చెందిన కియా మోటార్స్ భారత్ వాహన రంగంలో చాలా కొద్ది కాలంలోనే ఎంతో ఆదరణ పొందింది. భారత్ ఆటో మొబైల్ రంగంలో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది. ప్రతీ ఒక్కరిని కియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఎంతో నమ్మకమైన కంపెనీగా పేరు ప్రఖ్యాతులు సంపాధించుకుంది. కానీ కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం వాహన కొనుగోలుదారులకు షాక్‌కు గురి చేసింది. కార్ల వివిధ మోడళ్ల రేట్లను కియా ఇండియా భారీగా పెంచాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు పెంపు బాటపడుతాయని సూచిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఇదే మార్గంలో ఇప్పుడు కియా ఇండియా కూడా పలు కార్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. భారత్ మార్కెట్లో సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కారెన్స్ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్, కియా సెల్టోస్, సోనెట్, కార్నివాల్ ధరలు ఇప్పుడు భారీగా పెరగనున్నాయి.
వాహన ధరలు పరిశీలిస్తే..
- భారత్ మార్కెట్లో కియా కారెన్స్ ఎంపీవీ వాహనాన్ని సంస్థ లాంచ్ చేసింది. కియా కారెన్స్ పెట్రోల్, డీజెల్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలను రూ.70వేల వరకు పెంచింది. ఆయా ట్రిమ్స్ మోడల్స్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ కలిగిన ప్రీమియం 7 సీటర్ కియా కారెన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన లగ్జరీ ప్లస్ 7 సీటర్ ధరలు రూ.40వేల నుంచి రూ.70వేల వరకు పెరిగింది.
- కియా సెల్టోస్ ధర రూ.10,000 నుంచి రూ.36,000 వరకు పెరిగాయి. కియా సెల్టోస్ జీటీఎక్స్ ప్లస్ 1.4 మ్యానువల్ ధర రూ.10,000 పెరిగింది. సెల్టోస్ హెచ్‌టీఎక్స్ ప్లస్ 1.5 మ్యానువల్, ఐఎంటీ ట్రిమ్స్ ధరలు రూ.36,000 మేర పెరిగాయి. కియా సెల్టోస్ డీజెల్ మోడల్స్ ధరలు రూ.20,000 నుంచి రూ.34,000 వరకు పెరగనున్నట్టు వెల్లడించింది.
- కియా సోనెట్ పెట్రోల్, డీజెల్ మోడళ్ల ధరలు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు పెరిగాయి. పెట్రోల్ సోనెట్ హెచ్‌టీఎక్స్ 1.0 మోడల్ ధర రూ.30,000 వరకు పెరిగింది. కియా సోనెట్ హెచ్‌టీఎక్స్ 1.5 డీజెల్ వెర్షన్ ఇప్పుడు జీటీఎక్స్ 1.5 మ్యానువల్ వెర్షన్ కంటే రూ.30,000 వరకు ఖరీదైంది.
- కియా కార్నివాల్ ధరలను రూ.50,000 పెంచుతూ కియా నిర్ణయం తీసుకుంది. 6 సీట్ల ప్రిస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.29.49 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు ఈ కారు విలువ రూ.29.99 లక్షలకు చేరుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..