దేశంలోని ప్రధాన నగరాల్లో నెలవారీ లీజుకు తమ బ్రాండ్ కార్లను అందించేందుకు కియా ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ‘కియా లీజ్’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి దశలో భాగంగా హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పూణె సిటీస్లో లీజుకు కియా కార్లు అందుబాటులో ఉండనున్నాయి.
లీజు పూర్తి కాగానే కారు వాపస్..
లీజు కాలం పూర్తయిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. అవసరాన్ని, ప్రాధాన్యతలనుబట్టి మరో కొత్త మాడల్ కారును మళ్లీ లీజుకు తీసుకోవచ్చు. కారు నెలవారీ మెయింటెనెన్స్, బీమా ఖర్చులను కంపెనీయే చూసుకుంటుంది. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లీజింగ్ మాడల్ ట్రెండింగ్ లో ఉంది. దేశంలోనూ ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ లభిస్తోంది. అందుకే ‘కియా లీజ్’ను తీసుకొచ్చాం. అందుబాటు ధరల్లో కార్లను లీజుకు ఇవ్వనున్నాం. దీనివల్ల మా కస్టమర్లు మున్ముందు ఇంకా పెరుగుతారు’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మైయుంగ్-సిక్ సోన్ తెలిపారు.
కనీస నెలవారీ లీజు ఇలా..
= కియా సోనెట్ రూ. 21,900
= కారెన్స్ రూ. 28,800
= సెల్టోస్ రూ. 28,900
= 24 నెలల నుంచి 60 నెలల కాలానికి ఈ కార్లను లీజుకు తీసుకోవచ్చు.
= ఇందుకోసం ఎలాంటి డౌన్ పేమెంట్లు చెల్లించాల్సిన అవసరం లేదు.