గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏప్రిల్- ఆగస్టులో ఉద్యోగ నియామకాలు పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 23 శాతం ఉద్యోగ ప్రకటనలు పెరిగినట్లు తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్, టెలికం సహా పలు రంగాల్లో ఏప్రిల్- ఆగస్టులో మొత్తం 32,000 ఉద్యోగ ప్రకటనలు నమోదయ్యాయి. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నియామకాలు పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నించడం వల్ల నియామకాలు పెరిగినట్లు పేర్కొంది.
ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్ బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలకు పండుగ సీజన్‌లో అధికంగా గిరాకీ ఉండే అవకాశం ఉంది. పండగ సీజన్‌లోకి అడుగుపెడుతున్న వేళ నియామకాల ప్రకటనలు 23 శాతం పెరగడం ప్రోత్సాకరమైన విషయమని తెలిపింది. ద్రవ్యోల్బణం లాభదాయకత ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఈ, రిటైల్ లాంటి రంగాల్లో నియామకాల ప్రకటనలు గణనీయ స్థాయిలో పెరిగాయి.
రానున్న కాలంలోనూ ఈ ధోరణి కొనసాగవచ్చని క్వెస్ కార్ప్ తెలిపింది. పండగు సీజన్‌లో నెలకు కనీసం 5000 మేర నియామకాల ప్రకటనలు రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్ కోసం చేపట్టబోయే నియామకాలు నోయిడా, పుణే, చైన్నయ్ ముంబై, బెంగళూర్, హైదరాబాద్ నుంచి అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది