దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా టారిఫ్ ప్లాన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది కనిష్టంగా 12.5 శాతం నుంచి గరిష్టంగా 25 శాతం వరకు ఉంటుంది. రీఛార్జ్ చేసుకునేందుకు కొంత సమయం ఇచ్చింది. ఇంకా ఇదే సమయంలో మరికొన్ని అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్ కూడా తీసుకొచ్చింది. కాగా, సవరించిన కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు జూలై 3, 2024 నుండి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
పాపులర్ ప్లాన్ల పాత, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..
ముందుగా నెలవారీ ప్లాన్ల విషయానికి వస్తే 2GB డేటాతో ఉన్న రూ.155 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఇప్పుడు రూ.189 కి లభిస్తుంది. డైలీ 1GB డేటాతో 28 రోజుల గడువు ఉన్న ప్లాన్ పాత రేటు రూ.209 కాగా.. ఇప్పుడు అది రూ.249 కి చేరనుంది. 1.5GB/Day రూ. 239 ప్లాన్.. రూ. 299కి చేరనుంది.
చాలా పాపులర్ ప్లాన్ అయిన 84 రోజుల వ్యాలిడిటీ, 1.5GB/Day ప్లాన్ ప్రస్తుతం రూ. 666 కు లభిస్తుండగా ఇది రూ. 799 కి చేరనుంది. 84 రోజుల 2GB/Day ప్లాన్ ప్రస్తుతం రూ. 719 గా ఉండగా.. ఇది రూ. 859 కి పెరుగుతుంది. 365 రోజుల వార్షిక ప్లాన్ డైలీ 2.5GB/Day ప్రస్తుతం రూ. 2999 గా ఉండగా.. ఇది రూ. 3599 కి చేరనుంది. ఇక్కడ రూ. 600 పెరిగిందన్నమాట.
డేటా యాడ్ ఆన్ ప్లాన్ రేట్లు కూడా పెరిగాయి. 1GB యాడ్ ఆన్ రూ. 15 గా ఉండగా.. రూ. 19కి చేరనుంది. 2GB రూ. 25 నుంచి రూ. 29 కి పెరిగింది. 6GB యాడ్ ఆన్ రూ. 61 నుంచి రూ. 69 కి చేరింది. మరోవైపు పోస్ట్ పెయిడ్ ప్లాన్ రేట్లు కూడా 15 శాతం వరకు పెరిగాయి.
5G అన్‌లిమిటెడ్ డేటా ప్రస్తుతం రూ. 239 రీఛార్జితో కూడా లభిస్తుండగా.. ఇది తర్వాత కనీసం రూ. 349 తో రీఛార్జి చేసుకుంటేనే వస్తుంది. 2GB/Day అంతకుమించి చేసుకునే రీఛార్జులపైనే ఇకపై అన్‌లిమిటెడ్ 5GB డేటా పనిచేస్తుంది.