Tuesday, November 19, 2024

సూచీలపై ఐటీ ఒత్తిడి, నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 59వేల దిగువకు సెన్సెక్స్‌

ముంబై : భారతీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌తో సూచీలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేశారు. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్చి త్రైమాసిక (2021-22) కార్పొరేట్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దీనికితోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్‌ 59వేల దిగువకు పడిపోగా.. నిఫ్టీ 17,700 స్థానికి కోల్పోయింది. ఉదయం 59,231 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌.. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఓ దశలో 58,894 పాయింట్ల వద్ద 500 పాయింట్లు మేర నష్టం చవిచూసింది. చివరికి 482.61 పాయింట్ల నష్టంతో 58,964.57 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 109.40 పాయింట్లు నష్టపోయి 17,674.95 పాయింట్ల వద్ద స్థిరపడింది.

హెచ్డీఎఫ్‌సీ ట్విన్స్‌ డౌన్‌
మిడ్‌ క్యాప్‌ 100 ఇండక్స్‌ 0.62 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.06 శాతం పతనం అయ్యింది. నిఫ్టీ ఐటీ 1.41 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.56 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ టాప్‌ లూజర్‌గా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ నిలిచింది. ఈ స్టాక్‌ 2.65 శాతం మేర పడిపోయింది. చివరికి రూ.1,134 వద్ద నిలిచింది. ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు కూడా నష్టాలు చవిచూశాయి. 2,115 కంపెనీల షేర్లు లాభాలు పొందగా.. 1441 షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్డీఎఫ్‌సీ ట్విన్స్‌ (హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌), యాక్సిస్‌ బ్యాంకు నష్ట పోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వరుగా ఐదో సెషన్‌లోనూ పడిపోయాయి. గత వారం మెగా విలీనాన్ని ప్రకటించిన తరువాత 10 శాతం పెరిగిన రెండు స్టాక్‌లు అంతే మొత్తంలో పడిపోయాయి.

లాభాల్లో ఎన్‌టీపీసీ, కొటక్‌
యోగా గురు రామ్‌దేవ్‌ రుచి సోయా ఇండస్ట్రీస్‌ షేర్లు కంపెనీ పేరును పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌గా మార్చాలని నిర్ణయించుకున్న తరువాత.. 0.56 శాతం పడిపోయి.. రూ.918.25 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడే డీల్స్‌లో ఈ స్టాక్‌ నష్టాల్లో స్థిరపడకముందే 8 శాతానికి పైగా పెరిగింద. రుచి సోయా ఇటీవల తన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.4,300 కోట్లను సమీకరించింది. ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌టీపీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మాలు లాభాలతో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement