Friday, November 22, 2024

భాగ్యనగరమంతా ఐటీ వెలుగులు.. 20 లక్షల స్క్వేర్‌ ఫీట్‌ల విస్తీర్ణంతో భారీ ఐటీ టవర్‌ నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాజధాని హైదరాబాద్‌ నగరం పాతబస్తీలో ఐటీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన గ్రిడ్‌ పాలసీలో భాగంగా నగరం నలుమూలల ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాతబస్తీలోని మలక్‌పేటలో భారీ ఐటీ పార్కు నిర్మించాలని ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ)ని ఆదేశించింది. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఉన్న 10 ఎకరాల స్థలంలోని 4 ఎకరాల్లో ఏకంగా 20 లక్షల స్క్వేర్‌ ఫీట్‌ విస్తీర్ణంతో భారీ ఐటీ టవర్‌ను నిర్మించాలని టీఎస్‌ఐఐసీ నిర్ణయించింది. ఇందుకుగాను జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌(జేడీఏ) పద్ధతిన ఐటీ టవర్‌ నిర్మాణానికిగాను టీఎస్‌ఐఐసీ తాజాగా డెవలపర్‌ల నుంచి బిడ్లు ఆహ్వానించింది. దీంతో హైదరాబాద్‌లో పశ్చిమ దిశలోనే కేంద్రీకృతమై ఉన్న ఐటీ పార్కులు, కంపెనీలను నగరంలోని అన్ని దిక్కులా వికేంద్రీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

50 శాతం స్థలంలో 20 లక్షల స్క్వేర్‌ ఫీట్‌ టవర్‌లో 50 శాతం ఐటీ కంపెనీలకు కేటాయించడానికి వీలుగా ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయాలు, 50 శాతం రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ కాంప్లెక్సుల టవర్లు హోటళ్లు, గోల్ఫ్‌ కోర్సులు నిర్మించనున్నట్లు డెవలపర్లను ఆహ్వానిస్తూ టీఎస్‌ఐఐసీ విడుదల చేసిన రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌లో టీఎస్‌ఐఐసీ తెలిపింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పెట్రోల్‌ బంకులు, కార్ల షోరూములు, గో డౌన్లు తదితర కార్యకాలపాలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు తెలిపింది. డెవలపర్లు టెండర్లు దాఖలు చేయడానికి అక్టోబరు 29వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారు.

కొంపల్లిలో రూ.1000 కోట్లతో గేట్‌ వే పార్కు నిర్మాణం…

నగరం ఉత్తర దిశలో కొంపల్లిలో రాష్ట్ర ఐటీ శాఖ, టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో రూ.1000 కోట్లతో భారీ గేట్‌ వే ఐటీ పార్కు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌(జేడీఏ) పద్ధతిలో పార్కు అభివృద్ధి చేసేందుకు డెవలపర్లను ఆహ్వానిస్తూ టీఎస్‌ఐఐసీ ఇప్పటికే టెండర్లు పిలిచింది.

- Advertisement -

గ్రిడ్‌ పాలసీతో నగరమంతా సమాన అభివృద్ధి…

నగరంలో పశ్చిమ వైపే కేంద్రీకృతమై ఉన్న ఐటీ కంపెనీల వల్ల ఒక వైపు ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండడంతో పాటు ఆ ప్రాంతం చుట్టు పక్కలే అభివృద్ధి జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ రంగాన్ని నగరం నలువైపులా అభివృద్ధి చేస్తేనే ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతో పాటు అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రిడ్‌ పాలసీని ప్రవేశ పెట్టిందని రాష్ట్ర ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement