Saturday, November 23, 2024

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు శుభం కార్డు ! టీసీఎస్‌ అధికారిక ప్రకటనతో త్వరలో ఆఫీసులకు ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌ ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అధికారికంగా ముగింపు పలుకుతూ ప్రకటన చేయడంతో త్వరలో మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీ ఆఫీసులు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా వేలాది మంది కొత్త ఉద్యోగులు కంపెనీలో చేరి అప్పుడే రెండేళ్లు గడిచిందని టీసీఎస్‌ కంపెనీ తెలిపింది. వీరంతా త్వరలో ఆఫీసులను తొలిసారిగా చూడబోతున్నారని పేర్కొంది. అయితే వీరిలో ఎంతమంది కంపెనీలో కొనసాగుతారో తెలియదని, ఏ ఇతర కంపెనీ అయినా ఇంకా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగిస్తే అందులోకి వారంతా వెళ్లే అవకాశాలు లేకపోలేదని కంపెనీ సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లోనూ టీసీఎస్‌ కంపెనీలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటారు. తాజాగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు కంపెనీ ముగింపు పలుకుతూ కంపెనీ నిర్ణయం తీసుకోవడంతో వీరంతా భాగ్యనగరంలోని తమ ఆఫీసుల బాట పట్టనున్నారు.

2020 మార్చిలో కొవిడ్‌ సంక్షోభం తలెత్తి కరోనా కేసులు పెరిగిన తర్వాత ఇళ్లకే పరిమితమై పనిచేస్తున్న వీరు త్వరలో ఆఫీసుల నుంచి పనిచేయడానికి సిద్ధమవాల్సి ఉంటుందని టీసీఎస్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీల మధ్య వ్యాపార పరంగా తీవ్ర పోటీ నెలకొని ఉంటుందని, టీసీఎస్‌ లాంటి కంపెనీ తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించడానికి సిద్ధమైనపుడు మిగిలిన కంపెనీలు కూడా తప్పనిసరిగా ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయిస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. లేదంటే వ్యాపారంలో ఉత్పాదకతలో వెనుకబడిపోయే అవకాశాలున్నట్లు ఆయా కంపెనీలు భావిస్తాయని వారు చెబుతున్నారు.

ఈనేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మందైనా అతి త్వరలో మళ్లి ఆఫీసుల నుంచి పనిచేస్తారని, దీంతో ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడ్డ వేలాది మంది వెండార్లు లాభపడనున్నారని, తద్వారా భారీగా పరోక్ష ఉపాధి లభించనుందని ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత వచ్చిన కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌ వేవ్‌లలో కేసులు పెరిగినప్పటికీ పెద్దగా ఎవరూ ఆస్పత్రుల పాలు కాకపోవడంతో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించే దిశగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే ఉద్యోగుల ఆరోగ్య భద్రత ముఖ్యమని భావించిన కంపెనీలు కొవిడ్‌తో ఇకముందు ముప్పు లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్తలతో ఆఫీసులు తెరిచేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది.

ఆఫీసు స్పేస్‌కు మళ్లి గిరాకీ…

ఇటీవలి కాలంలో కార్యాలయం ప్రదేశ లీజుల్లో దేశంలోని అన్ని మెట్రో నగరాలు దూసుకుపోతుండగా ఐటీ హబ్‌లుగా పేరొందిన బెంగళూరు, హైదరాబాద్‌లు ఈ రేసులో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో రికార్డుస్థాయిలో ఆఫీసు ప్రదేశం లీజు ఒప్పందాలు జరుగుతున్నట్లు పలు కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం నగరంలో 44 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌ల కార్యాలయ ప్రదేశం నిర్మాణంలో ఉందని అవి చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement