హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ప్రభావానికి గురయ్యే అవకాశాలుంటే ముందుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతారు.. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులే ఆ రంగంలోని ప్రముఖ కంపెనీలను ఒక ఆట ఆడిస్తున్నారని హైసియా లాంటి సంస్థలు పేర్కొంటున్నాయి. ఐటీ రంగం పూర్తిగా కొత్త సాంకేతికలతో డిజిటల్ మయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాంకేతికతకు సంబంధించిన నైపుణ్యాలున్న వారికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో కంపెనీలే ఈ తరహా నైపుణ్యాలున్న ఉద్యోగుల చుట్టూ తిరిగే పరిస్థితులు నెలకొన్నాయని హైసియా చెబుతోంది. దీంతో ఉద్యోగులు పెట్టే షరతులన్నింటికీ కంపెనీలు ఒప్పుకుంటేనే వారు ఆయా కంపెనీల్లో కొనసాగుతున్నారు. లేదంటే గుడ్ బై చెప్పి తమకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు వెళుతున్నారని హైసియా పేర్కొంటోంది. ఇందులో భాగంగానే కొవిడ్ తలెత్తినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కొనసాగుతున్న ఐటీ ఉద్యోగులు కంపెనీల యాజమాన్యాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆఫీసుల నుంచి పనిచేసేందుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న సుమారు 1600 కంపెనీలకు చెందిన 7 లక్షల మంది దాకా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఇప్పటికీ ఎక్కువ మంది ఇళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారని, అత్యవసరమైతే తప్ప ఆఫీసు గడప తొక్కడం లేదని హైసియా చేసిన అధ్యయనంలో తేలింది. కేవలం కంపెనీల యాజమాన్యాలే కాకుండా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ వర్గాలు కూడా ఇటు కంపెనీల యాజమాన్యాలతో అటు ఉద్యోగులతో నిరంతరం వర్క్ ఫ్రమ్ ఆఫీసుపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయడం తిరిగి ప్రారంభిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో మంచిదని అధికారులు భావిస్తుండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
అన్నీ అనుకూలంగా ఉంటేనే…
హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగుల్లో కొంత మంది కొవిడ్ కాలాన్ని తమకు కావాల్సిన విధంగా మలుచుకుని ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసి భారీగా లబ్ధి పొందారని, తద్వారా ఆర్థికంగా బలపడి ప్రస్తుతం కంపెనీలకే షరతులు పెట్టే స్థాయికి వచ్చారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్ని కంపెనీల్లో నూ అవే డిజిటల్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ తదితర రంగాలకు చెందిన ప్రాజెక్టులు కావడంతో పనివేళల్లో సర్దుబాటు చేసుకుని ఒక్కొక్కరు రెండు ఉద్యోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా రెండు కంపెనీల్లో పని చేసిన వారిలో డిజిటల్ నైపుణ్యాలు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని కంపెనీల హెచ్ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఇళ్లు విడిచి ఆఫీసుకు రావాలని కోరితే కొందరు ఉద్యోగులైతే ఏకంగా రాజీనామాలే ఇస్తున్నట్లు హెచ్‌ఆర్ విభాగ అధికారులు చెబుతున్నారు. వేతనాలు, ఇతర అలవెన్సులు అధికంగా ఉన్నచోట, సెలవులు, పనివేళలు అనుకూలంగా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఉంటేనే కంపెనీల్లో కొనసాగడానికి ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారని, లేదంటే గుడ్ బై చెప్పేస్తున్నారని పలు ఐటీ కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో నైపుణ్యం ఉన్నవారిని వదులుకుంటే ఈ ప్రభావం నేరుగా కంపెనీ వ్యాపారంపై పడుతున్నందున, ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గక తప్పడం లేదని కంపెనీల యాజమాన్యాలు తమ గోడు వెల్లబోసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వస్తుందన్న అంచనాల మధ్య ఐటీ కంపెనీల యాజమాన్యాలకు ఉద్యోగులు భయపడాల్సిందిపోయి ఏకంగా యాజమాన్యాలనే ఉద్యోగులు భయపెట్టే స్థాయికి వెళ్లారంటే అంతా డిజిటల్ సాంకేతికత పుణ్యమేనని కంపెనీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.