మన దేశంలో ఐటీ సంస్థలు ఉద్యోగుల బోనస్‌ల్లో కోత విధిస్తున్నాయి. అమెరికా, యూరోప్‌ల్లోని ఐటీ కంపెనీల క్లైయింట్స్ బడ్జెట్ కోత విధించుకోవడంతో దాని ప్రభావం మన ఐటీ ఉద్యోగులపై పడింది. ఈ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆర్థిక సంక్షోభం భయాలు నెలకొన్నాయి. దీంతో ఈ దేశాల్లోని చాలా మంది కస్టమర్లు ఐటీ కంపెనీలకు వర్క్ అర్డర్లు ఇవ్వడంలేదు. ఆయా క్లైయింట్స్ తమ బడ్జెట్‌ల్లో కోత విధించుకున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియపరిచాయి. ఉద్యోగులకు ఇస్తున్న రకరకాల ప్రోత్సహకాలను, బోనస్‌లోనూ కోత విధిస్తున్నట్లు ఈ కంపెనీలు వెల్లడించాయి. ఇదే బాటలో మరికొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా నడుస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల పనితీరుకు, వేతనాలకు లింక్ పెట్టాయి. పనితీరు ఆధారంగానే వేతన ప్యాకేజీ నిర్ణయిస్తామని ఈ కంపెనీలు స్పష్టం చేశాయి.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభాల భయాల నేపథ్యంలో ఐటీ కంపెనీల బిజినెస్ కూడా ఆధారపడి ఉంటుందని, దీనికి అందరూ సిద్ధం కావాల్సి ఉంటుందని అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ పీటర్ బెండూర్ సామ్యూల్ అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని, దీనికి అనుగుణంగా ఆయా కంపెనీలు ముందుగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఐటీ కంపెనీలు నిపుణులైన ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ కంపెనీలకు ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ, క్రిఎ్టో కరెన్సీ రంగాల్లో ఎక్కువ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ క్లైయింట్స్ తమ బడ్జెట్‌లో కోత విధించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, ప్రధానంగా మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 3.6 శాతానికి తగ్గింది. గత సంవత్సరం కంపెనీ మార్జిన్లు 20.1 శాతంగా ఉన్నాయి. విప్రో కంపెనీ మార్జిన్లు కూడా 18.8 శాతం నుంచి 15 శాతానికి పడిపోయాయి. బోనస్‌లు, ఇతర అలవెన్స్‌లు తగ్గించమే కాదు, కొన్ని ఐటీ కంపెనీలు కొత్తగా రిక్రూట్‌మెంట్లను తగ్గించుకుంటున్నాయి.
ఆఫీస్‌లకు రమ్మంటున్న కంపెనీలు
ఒక వైపు ఉద్యోగులకు బోనస్‌ల్లో కోత విధిస్తున్న ఐటీ కంపెనీలు మరో వైపు వర్క్ ఫ్రం హోం బదులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. కొన్ని కంపెనీలు ఆఫీస్‌లకు రాకుంటే కొన్ని రాయితీలు వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తతుతన్నాయి. కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు అదనపు సెలవులు ఇస్తామని, వేరియబుల్ పే ఉంటుందని ఆశ చూపుతున్నాయి. దీంతో పాటు ఉద్యోగుల మధ్య అనుబంధం పెంచేలా వినోద, అతిథ్య కార్యక్రమాలకు అధిక నిధులు ఇచ్చేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కట్ చేస్తున్నాయి. ఇతర సదుపాయలను తగ్గిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వారంలో కనీసం మూడు రోజుల పాటు ఆఫీస్‌కు రావాలని కోరుతున్నాయి. కీలకమైన ప్రాజెక్ట్‌ల్లో పని చేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని కంపెనీలు షరతు పెడుతున్నాయి.
వలసల భయం
ఐటీ కంపెనీల్లో సాధారణంగానే వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇది 15 నుంచి 20 శాతం వరకు ఉంటోంది. మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీలకు ఉద్యోగులు మారుతుంటారు. ఇది గత సంవత్సరకాలంగా మరింత పెరిగింది. కీలకమైన ప్రాజెక్ట్ ల్లో పని చేసే ఉద్యోగులకు ఐటీ కంపెనీలు అధిక ప్యాకేజీలు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాయి. దీని వల్ల నిపుణులైన ఉద్యోగులను రక్షించుకోవడం కూడా ఐటీ కంపెనీలకు తప్పనిసరిగా మారింది. ఈ నేపధ్యంలోనే వర్క్‌ఫ్రం హోం వల్ల చాలా ఖర్చులు తగ్గిన్పటికీ, ఆఫీస్‌లకు రావాల్సిందిగా కంపెనీలు కోరుతున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం కొత్తగా తీసుకున్న వారిని తప్పనిసరిగా ఆఫీస్‌లకే వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. వీరికి పని పద్దతులు, కార్యాలయ వాతావరణం అలవాటు కావాల్సి ఉందని హెచ్‌ఆర్ నిపుణులు చెబుతున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు దీర్ఘకాలం ఇంటి నుంచే పని చేయడం వల్ల డేటా భద్రతపై కంపెనీల్లో ఆందోళన నెలకొంది. దీని వల్లే కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు రావాల్సింది గా కోరుతున్నాయని చెబుతున్నారు. దీని వల్లే చాలా ఐటీ కంపెనీల్లో ఆఫీస్‌లకు వచ్చి పని చేసే వారి సంఖ్య 40 శాతం వరకు ఉంటోంది.