Monday, November 25, 2024

ఇండియా నుంచి ఐ ఫోన్‌ ఎగుమతులు.. ఏప్రిల్‌ నుంచి 1 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు

మన దేశం నుంచి ఐఫోన్ల ఎగుమతులు ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 1 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మన దేశంలో అసెంబుల్‌ అవుతున్న ఐఫోన్లు ప్రధానంగా యూరోపియన్‌ దేశాలకు, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2023 మార్చి నాటికి ఈ ఎగుమతులు 2.5 బిలియన్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. మార్చి 2022తో ముగిసి ఆర్ధిక సంవత్సరంలో ఐఫోన్ల ఎగుమతులు 1.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. సెల్‌ఫోన్ల తయారీని దేశీయంగా పెంచాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పథకంలో భాగంగానే ఐఫోన్లు మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

సాధరాణంగా చైనా నుంచే ఐఫోన్లు చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. చైనాపై ఎక్కువగా ఆధారపడకూడదని యాపిల్‌ కంపెనీ నిర్ణయించడంతో మన దేశంలో వీటి తయారీ పెరుగుతోంది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సహకాల తరువాత మన దేశంలో ఐఫోన్ల తయారీ పెరిగింది. అయినప్పటికీ ఇంకా చైనా కంటే మన దేశం వెనుకబడి ఉంది. గత సంవత్సరం మన దేశంలో 30 లక్షల ఐఫోన్లు మాత్రమే మన దేశంలో తయారయ్యాయి. గత సంవత్సరం చైనాలో 23 కోట్ల ఫోన్లు తయారయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో 11,12,13 ఐఫోన్‌ మోడల్స్‌ తయారువుతున్నాయి. ఐఫోన్‌ 14ను దేశంలో తయారు చేయాలన్న ప్లాన్స్‌ ఉన్నాయని కంపెనీ ఇటీవలే వెల్లడించింది.

సెల్‌ఫోన్లతో పాటు, ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్స్‌ తయారీ కంపెనీలకు కూడా ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో దేశం గణనీయమైన పురోగతి సాధించాలన్న లక్ష్యంతో వీటిని అందిస్తున్నారు. యాపిల్‌ కంపెనీ ఐఫోన్ల తో పాటు, మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. చైనా నుంచి యాపిల్‌ తన తయారీ ప్లాంట్‌ను మరో చోటకు తరలించడం అంత తేలికాదని బ్లూమ్‌బర్గ్‌ అభిప్రాయపడింది. గడిచిన పది సంవత్సరాల్లో చైనాలో కాకుండా ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ముఖ్యంగా తయారీ చేస్తున్న ఫోన్లు కేవలం 2 శాతం మాత్రమే. 98 శాతం ఐఫోన్లు చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. చైనాలో తయారువుతున్న ఐఫోన్లను ఇతర మార్కెట్లకు తరలించేందుకు బలమైన సప్లయ్‌ చైన్‌కు ఏర్పాటు చేసుకుంది. దీన్ని తరలించడం అంత సులభం కాదని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement